పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన భారత్‌


భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. రాజస్థాన్‌లోని బికనేర్‌ నల్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సోమవారం ఉదయం 11.30 గంటలకు ‘సుఖోయి 30ఎంకేఐ’ ద్వారా ఆ డ్రోన్‌ను కూల్చేసినట్లు మీడియాకు తెలిసింది. భారత గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ పాక్‌ ఈ చర్యకు పాల్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆ సరిహద్దు ప్రాంతంలోకి పాక్‌కు చెందిన డ్రోన్‌ ప్రవేశించిన వెంటనే గుర్తించిన భారత్‌.. దాన్ని పేల్చేసిందని తెలిసింది. భారత వైమానిక దళ రాడార్ల ద్వారా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి, వెంటనే ప్రతిస్పందించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

కాగా, గుజరాత్‌లోని కచ్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌ బేస్‌ సమీపంలో ఇటీవల పాక్‌కు చెందిన మరో డ్రోన్‌ని భారత్‌ కూల్చి వేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి చొచ్చుకురాగా ఇటీవల ఆ డ్రోనును కూల్చేశారు. ఆ ఘటన మరవక ముందే పాక్‌కు చెందిన మరో డ్రోన్‌ భారత గగనతలంలోకి రావడం గమనార్హం.