జగన్‌పై మండిపడుతూ ఎమ్మెల్యేల లేఖ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఫ్యాక్షన్ పునాదులపై నిర్మించబడ్డ మీ ఫ్యూడల్ మనస్తత్వం భరించలేకే టీడీపీలో చేరామని జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబును బలపరిచామని లేఖలో తెలిపారు. అధికారమే పరమావధిగా కుట్ర రాజకీయాలకు పాల్పడుతుండటాన్ని, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా చూడటాన్ని సహించలేకపోయామని మండిపడ్డారు.

ప్రజలకు మేలు జరగాలని మేమిచ్చే సలహాలు స్వీకరించే మనస్తత్వం జగన్‌లో లేదని, సహ నిందితులతో ముందుకు సాగాలన్న మీ ఆలోచననూ భరించలేకపోయామని వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు ఎందుకు మద్దతు పలకాల్సి వచ్చిందో తెలుపుతూ 6 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం మీ అసమర్థత కాదా అని మండిపడ్డారు. ఆస్తుల పరిరక్షణ, కేసుల మాఫీ కోసం ప్రధాని మోడీ ముందు మోకరిల్లారని లేఖలో జగన్‌ను ఆరోపించారు.