రేపు జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలుపనున్న టీడీపీ బృందం

ఎన్నికల్లో విజయదుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతల బృందం రేపు జగన్‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలవనుంది. టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు జగన్‌ను కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున శుభాకాంక్షలు తెలపనున్నారు. అలాగే చంద్రబాబు అభినందన లేఖను జగన్‌కు అందజేయనున్నారు.

జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశంపై టీడీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సుముఖత చూపగా.. నేతలు ఆయనను వారించినట్టు సమాచారం. రాజ్‌భవన్ వంటి వేదికల వద్ద ప్రమాణ స్వీకారం చేసినట్టయితే వెళ్తే హుందాగా ఉంటుందని.. . బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున వెళ్లడం సరికాదేమోనని పలువురు నేతలు చంద్రబాబుకు సూచించారు. పార్టీ తరఫున జగన్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు ఓ బృందాన్ని పంపాలని మెజార్టీ నేతలు సూచించగా.. అందుకు చంద్రబాబు అంగీకరించారు.