వీడియో విడుదల చేసిన టీవీ9 రవి ప్రకాష్

గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంత మంది కావాలనే కుట్ర పన్నారని.. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఉగ్రవాది కంటే హీనంగా చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరి ప్రలోభాలకు లొంగి పోలీసులు వేధిస్తున్నారని రవి ప్రకాష్ ఆరోపించారు. భాగ్య వంతులకు పోలీసులు ఎంతైనా ఊడిగం చేయొచ్చు కానీ.. రవి ప్రకాష్ లాంటి ఓ న్యూస్ ఛానల్ సీఈవో విషయంలో వారు పెడుతున్న దొంగ కేసులు, వ్యవహరిస్తున్న తీరు, రవి ప్రకాష్ సన్నిహితులను వేధిస్తున్న తీరును చూస్తుంటే పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా అన్న సందేహం కలుగుతోందని అన్నారు. టీవీ9 సంస్థను స్థాపించింది తానేనని.. దేశంలో న్యూస్ ఛానెళ్లన్నీ నష్టాల బాటలో నడుస్తున్న సమయంలో టీవీ9ను లాభాల బాటలో నడిపించానని తెలిపారు. అలాంటి తనను పోలీసుల అండతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని రవిప్రకాశ్ ఆరోపించారు.