అక్షయ్‌ స్టంట్‌పై ట్వింకిల్‌ ఆగ్రహం .. చంపేస్తాను.. అంటూ ట్వీట్‌

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ చేసిన ఓ భయంకరమైన స్టంట్‌ పట్ల ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ది ఎండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో అక్షయ్‌కుమార్‌ నటించబోతున్నారు. తాను నటించబోయే తొలి వెబ్‌సిరీస్‌ కావడంతో గ్రాండ్‌గా దీని గురించి ప్రకటించాలని నిర్ణయించుకున్నారు అక్షయ్‌. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ హీరో ధైర్యం చేయలేని స్టంట్‌ను అక్షయ్‌ చేశారు. ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్‌పై నడిచారు. దీనిపై ట్వింకిల్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘ఛీ.. నీ ఒంటికి నువ్వే నిప్పటించుకోవడానికి ఈ తీరును ఎంచుకున్నావన్నమాట. ఈ విన్యాసం చేసిన తర్వాత కూడా బతికే ఉంటే ఇంటికిరా.. నిన్ను నేను చంపేస్తాను’ అంటూ చిర్రుబుర్రులాడారు. ట్వింకిల్‌ ట్వీట్‌కు అక్షయ్‌ స్పందిస్తూ.. ‘ఇప్పుడు నాకు ఈ విషయంలో భయంగా ఉంది’ అని చమత్కరించారు. అంతేకాదు ‘దేవుడా నన్ను కాపాడు’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఈ సాహసోపేతమైన ఘటన గురించి అక్షయ్‌ స్పందిస్తూ.. ‘యాక్షన్‌ నా రక్తంలోనే ఉంది. ముందు నేను స్టంట్‌మ్యాన్‌ని. ఆ తర్వాతే యాక్టర్‌ని’ అని తెలిపారు. అయితే తాను చేయబోయే వెబ్‌సిరీస్‌ షో గురించి అక్షయ్‌ ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. తన కుమారుడు ఆరవ్‌ సూచన మేరకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఒప్పుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌తో పాటు అక్షయ్‌ ‘కేసరి’, ‘సూర్యవంశి’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. మార్చి 21న ‘కేసరి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.