
కరోనాపై పోరాటంలో ఎవరికి వారు తమ వంతు బాధ్యత వహిస్తున్నారు. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. వారిని అభినందించేందుకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులతో ముచ్చటించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆపత్కాల సమయంలో సేవలందిస్తున్న పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. నిరంతరం పని ఒత్తిడితో ఉండే తమకు విజయ్ మాటలతో ఉత్సాహం వచ్చిందని అధికారులు తెలిపారు. తమతో ముచ్చటించిన హీరో దేవరకొండకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానాలు ఇచ్చారు. చెక్‌పోస్టుల వద్దకు వచ్చి ప్రజలను ఇళ్లనుంచి బయటకు రావొద్దని కోరితే బాగుంటుందన్న పోలీసుల ప్రశ్నకు.. నేను వచ్చి చెబితే మంచి జరుగుతుందంటే తప్పకుండా వస్తాను అన్నారు.
అనవసరంగా బయట తిరిగే వారికి మీ పద్ధతిలోనే సమాధానం చెప్పాలని విజయ్ అన్నారు. లాక్‌డౌన్ సమయంలో మీ అమ్మకు సాయం చేస్తున్నారా అన్న ప్రశ్నకు.. అమ్మపడుతున్న కష్టం చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తోందని.. ఇంటి పనిని చక్కబెడుతున్న మహిళా అధికారులకు హ్యాట్సాఫ్ అని అన్నారు. మిమ్మల్ని పోలీసు అధికారి పాత్రలో చూడాలనుందన్న ప్రశ్నకు తప్పకుండా చేస్తా. రెండు మూడేళ్లలో మంచి పోలీసు పాత్రతో మీముందుకొస్తానని చెప్పారు.













