‘హిట్‌’ మూవీ రివ్యూ

నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిరనేని నిర్మించిన చిత్రం ‘హిట్‌’.‘ది ఫస్ట్‌ కేస్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌ . ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌, రుహానీ శర్మ హీరో,హీరోయిన్‌లుగా నటించారు. శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీతో నాని ప్రొడ్యూసర్‌గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? క్రైమ్‌ స్టోరీని దర్శకుడు శైలేష్‌ కొలను తెరపై ఆకట్టుకునే విదంగా చూపించడా? విశ్వక్‌ సేన క్రైమ్‌ ఇన్వెస్టిగేట్‌ ఆఫీసర్‌గా ఏంత మేరకు మెప్పించగలిగాడు? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ: క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం(హిట్‌) ఓ విభాగం. హిట్‌కు విశ్వ (భానుచందర్‌) హెడ్‌. విశ్వ టీంలోనే విక్రమ్‌ (విశ్వక్‌ సేన్‌), రోహిత్‌, అభిలాష్‌లు ఎంతో నిజాయితీ మరియు టాలెంటెడ్‌ కలిగిన ఆఫీసర్స్‌. ప్రతీ క్రైమ్‌ కేసును సులువుగా ఛేదిస్తుంటారు. ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న నేహ(రుహానీ శర్మ), విక్రమ్‌ల మధ్య ఎప్పటినుంచో ప్రేమ కొనసాగుతోంది. ఈ క్రమంలో నగరంలో ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేహ కూడా కిడ్నాప్‌కి గురౌతుంది.

ఈ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే బాధ్యతను విక్రమ్‌కు విశ్వకు అప్పగిస్తాడు. అయితే కేసుకు సంబంధించి ఎటువైపు వెళ్లినా అన్ని దారులు మూసుకపోతుంటాయి. కేసులో భాగంగా విచారిస్తున్న వారందరూ అనుమానితులుగానే కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ కేసులోకి షీల(హరితేజ), షిండే (బ్రహ్మాజీ), ఇ​బ్రహీం(మురళీ శర్మ)లు ఎందుకు ఎంటర్‌ అవుతారు? చివరికి ఈ కేసును విక్రమ్‌ ఛేదించాడా? ప్రీతి, నేహాలను వారిని కిడ్నాప్‌ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? రెండు కిడ్నాప్‌లు చేసింది ఒకరేనా లేక ఇద్దరా? అసలు విక్రమ్‌కు ఉన్న ఆ వింత వ్యాధి ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటులు: తొలి రెండు సినిమాల్లో మన గల్లీలోని కుర్రాడిలా కనిపించిన విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాలో ఓ సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో మెరిశాడు. ఓ క్రైమ్‌ కేసును ఇన్వెస్టిగేషన్‌ చేసే క్రమంలో ఓ పోలీస్‌ అధికారి పడే ఇబ్బందులు, ఆలోచించే విధానం, టెన్షన్స్‌, ఎమోషన్స్‌, అంతేకాకుండా అతడికున్న వింత వ్యాధితో పాటు, ప్రేమించిన అమ్మాయి దూరం అవడంతో పడే ఆవేదన ఇలా అన్ని భావాలను పండించాడు విశ్వక్‌. ఈ కథ హీరోయిన్‌ మిస్సింగ్‌ చుట్టూ జరిగింది. అయినప్పటికి హీరోయిన్‌ రుహానీ శర్మకు నటన పరంగా అంతగా ప్రాధాన్యం దక్కలేదు. లుక్ పరంగా బాగుంది. హరితేజకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర చేసే అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఆమె చేయని క్యారెక్టర్‌ అయినప్పటికీ షీలా పాత్రలో ఒదిగిపోయింది. ఇక విక్రమ్‌తోనే ఉండే రోహిత్‌(సినిమాలో క్యారెక్టర్‌) కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. భానుచందర్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీలు తమ అనుభవంతో వారి పాత్రలను అవలీలగా చేశారు. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:నాని ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి విశ్వక్‌ సేన్‌తో సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ డిఫరెంట్‌ టైటిల్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని చెప్పగానే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఆసక్తిగా పెరిగిపోయింది. అభిమానుల అంచనాలను, నాని నమ్మకాన్ని, హీరో విశ్వక సేన్‌ ఆశలను దర్శకుడు శైలేష్‌ కొలను నిలబెట్టుకున్నాడు. ఇలాంటి క్రైమ్‌ స్టోరీలపై సినిమాలు చాలానే వచ్చినా.. ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. కథ మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టకుండా, బలమైన క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ సీన్లపైనే డైరెక్టర్‌ ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అవే సినిమాకు ప్రధాన బలం అవుతాయి. ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌తో పాటు మధ్య మధ్యలో హీరో,హీరోయినుల లవ్‌ సీన్స్‌, హీరో గతం గురించి చూపించడం వంటివి డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేకు అద్దంపట్టింది.

సినిమా మొదటి నుంచి ఎండ్‌ కార్డు పడే వరకు కూడా ప్రేక్షకుడు తరువాత ఎంటీ అని చాలా ఆతృతగా ఆసక్తిగా ఎదురుచూస్తాడు. కొన్ని క్రైమ్‌ సినిమాలలో అసలు దోషి ఎవరో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది అయితే హీరో అతడిని ఎలా పట్టుకుండాని ఆసక్తిగా తిలకిస్తారు. కానీ ఈ సినిమాలో హీరోతో పాటు ప్రేక్షకుడు కూడా అసలు ఈ కిడ్నాప్‌ చేసింది ఎవరో అని మదిలో ఇన్వెస్టిగేట్‌ చేయడం మొదలు పెడతారు. అయితే ప్రీ క్లైమాక్స్‌ వరకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌తోనే దర్శకుడు కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ క్రైమ్‌ కేసు వెనక బలమైన కారణాన్ని చూపించలేదు. దీంతో సినిమా గ్రాఫ్‌ ఒక్కసారిగి పడిపోయిన భావన కలుగుతుంది. హిట్‌కు సీక్వెల్‌ ఉండటంతో క్లైమాక్స్‌ను సాదాసీదాగా ముగించారేమో అనే సందేహం సగటు అభిమానికి కలగక మానదు. పాటలు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ.. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వివేక్‌ సాగర్‌ మ్యాజిక్‌ చేశాడు. ఇక సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. క్లైమాక్స్‌ ఒక్కటి మినహా సినిమా అంతా చకచకా సాగిపోతుంది.. ఇలాంటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడే వారు ‘హిట్‌’ కథలో తప్పకండా ఇన్వాల్స్‌ అయిపోతారు.

హైలైట్స్‌ : విశ్వక్‌ సేన నటన

డ్రాబ్యాక్స్ : క్లైమాక్‌లో బలం లేకపోవడం

టైటిల్ : ‘హిట్‌’
నటీనటులు: విశ్వక్‌సేన్‌, రుహానీ శర్మ, బ్రహ్మాజీ, బానుచందర్‌, మురళీశర్మ, తదితరులు
దర్శకత్వం : శైలేష్‌ కొలను
నిర్మాతలు : నాని, ప్రశాంతి త్రిపిరనేని
సంగీతం : ప్రవీణ్‌ లక్కరాజు

చివరిగా : విశ్వక్‌సేన్‌ ‘హిట్‌’ థ్రిల్‌ చేస్తాడు
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)