HomeTelugu Reviewsవిజిల్‌ మూవీ రివ్యూ

విజిల్‌ మూవీ రివ్యూ

తమిళ స్టార్‌ హీరో విజయ్‌.. మెర్శల్‌, సర్కార్‌ వంటి భారీ సూపర్‌హిట్స్‌ ఊపుమీదున్నాడు. ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి ‘విజిల్‌’ అనే స్పోర్ట్స్‌ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్‌-అట్లీ కాంబినేషన్‌లో తేరి, మెర్శల్‌ వంటి బాక్ల్‌బస్టర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటం, ఈ సినిమాలో విజయ్‌ డ్యుయల్‌ రోల్‌ చేస్తుండటంతో.. హ్యాట్రిక్‌ సూపర్‌హిట్‌ ఖాయమని ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్‌. విజయ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

10 13

కథ: మైఖేల్‌ రాజప్ప (విజయ్‌) స్థానికంగా మంచి రౌడీ. తన మురికివాడలోని వాళ్లను ప్రత్యర్థుల నుంచి కాపాడుకుంటూ ఉంటాడు. స్థానికంగా మంత్రి కాలేజీ మూయించాలని చూస్తే దానిని అడ్డుకుంటాడు. ప్రత్యర్థులు చెడు చేయకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అమ్మాయిల ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌ అయిన మైఖేల్‌ స్నేహితుడు కిరణ్‌ తన టీమ్‌ను తీసుకొని అతను ఉండే చోటుకి వస్తాడు. కిరణ్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రత్యర్థులు మైఖేల్‌పై అటాక్‌ చేస్తారు. ఈ దాడిలో మైఖేల్‌ రౌడీలను చితగ్గొట్టినప్పటికీ.. అతని విరోధి మాత్రం కిరణ్‌ను గొంతులో కత్తితో పొడుస్తాడు. దీంతో చికిత్స పొందుతూ.. ఆస్పత్రి బెడ్‌కు పరిమితమైన కిరణ్‌.. తనస్థానంలో మైఖేల్‌ను అమ్మాయిల టీమ్‌కు కోచ్‌గా వెళ్లమని కోరుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో బిగిల్‌గా పేరొందిన మైఖేల్‌ గొప్ప ఫుట్‌బాల్‌ ఆటగాడు. అతని తండ్రి రాజప్ప (విజయ్‌) స్థానికంగా పేరుమోసిన రౌడీ. అయినా తన కొడుకు కత్తి పట్టకుండా ఆటలతో పైకి రావాలని కోరుకుంటాడు. ఈక్రమంలో అతను, అతని స్నేహితులు కలిసి నేషనల్‌ గేమ్స్‌ ఆడేందుకు వెళ్తుండగా రైల్వే స్టేషన్‌లో ప్రత్యర్థులు అటాక్‌ చేసి.. మైఖేల్‌ కళ్లముందే రాజప్పను చంపేస్తారు. దీంతో జాతీయ కప్‌ కొట్టాలన్న తన తండ్రి కల రైల్వే స్టేషన్‌లో ఆగిపోతుం‍ది. పుట్‌బాల్‌ ప్లేయర్‌ కావాలనుకున్న మైఖేల్‌ తండ్రి స్థానంలోకి రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో కిరణ్‌ కోరిక మేరకు అమ్మాయిల జట్టుకు కోచ్‌గా మారిన మైఖేల్‌.. బిగిల్‌ కప్పు ముఖ్యంగా అన్న తండ్రి కలను నెరవేర్చాడా? కోచ్‌గా ఎలా నిలదొక్కుకు‍న్నాడు? నేషనల్‌ గేమ్స్‌లో అతనికి ఎదురైన అవాంతరాలు ఏమిటి? అమ్మాయిలు సమాజంలోని ప్రతికూలతలను ఎదుర్కొని ఎలా పోరాడారు? అన్నది తర్వాతి కథ.

విశ్లేషణ: స్పోర్ట్స్‌ డ్రామాకు బలమైన భావోద్వేగాలు ముఖ్యం. తెరమీద కనిపిస్తున్న ఆట నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తూ.. అందులో ప్రేక్షకుడిని మమేకం చేయాలి. అప్పుడే తెరమీద భావోద్వేగాలు పండుతాయి. షారుఖ్‌ ఖాన్‌ ‘చక్‌ దే ఇండియా’, సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’, అమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’, మాధవన్‌ ‘గురు’ సినిమాలు ఈవిధంగా తెరమీద భావోద్వేగాలను అద్భుతంగా పండించి.. ప్రేక్షకులతో శేభాష్‌ అనిపించుకున్నాయి. బిగిల్‌ పేరుకు స్పోర్ట్స్‌ డ్రామా అయినా అందులో ఫక్తు మాస్‌ యాక్షన్‌ సీన్లు బోలెడు ఉన్నాయి. విజయ్‌లాంటి స్టార్‌ హీరోతో పూర్తిస్థాయి స్పోర్ట్స్‌ డ్రామా చేయడం బాగుండదనుకున్నాడేమో డైరెక్టర్‌.. కథ కంటే కూడా ప్రతి 20, 30 నిమిషాలకు ఒక ఫైట్‌ సీన్‌.. హీరోను ఎలివేట్‌ చేసే సీన్లతో విసిగించాడు. అంతేకాకుండా సినిమా నిడిమి చాలా ఎక్కువైపోవడంతో కథ మీద దర్శకుడికి పట్టు తప్పినట్టు కనిపిస్తుంది. చాలా సీన్లు సాగదీతతో ఉండి.. తమిళ వాసనలతో బోర్‌ కొట్టిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌ భరించడం చాలా కష్టమే. ఫస్టాఫ్‌లో తండ్రీ-కొడుకుగా డ్యుయల్‌ రోల్స్‌లో విజయ్‌ పండించిన వేరియేషన్స్‌, వారి మధ్య అనుబంధం కొంచెం ఆకట్టుకుంటుంది. ఇక, ఫస్టాఫ్‌లో కనిపించే తండ్రి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు కనిపించదు. రాజప్ప నేపథ్యమేమిటో పూర్తిగా చూపించకుండానే దర్శకుడు అర్ధంతరంగా ముగించేసిన భావన కలుగుతుంది.

10a 1

ఇక, ఫస్టాఫ్‌లో సాఫ్ట్‌రోల్‌లో కనిపించిన ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జేకే శర్మ (జాకీష్రాఫ్‌) సెకండాఫ్‌లో విలన్‌గా అవతారమెత్తుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో రాజప్ప తనను చితకబాదినందుకు.. ఇప్పుడు కోచ్‌ మైఖేల్‌, అతని టీమ్‌ను ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఇలా మైదానంలో క్రీడాపరమైన ఉద్వేగాల కంటే.. హీరో-విలన్‌ మధ్య పోటాపోటీ సీన్లు.. కేవలం హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసినందుకు పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే, మన దేశంలో క్రీడల్లోకి వచ్చేందుకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు అట్లీ కొంత నిజాయితీగా చూపించడం ఆకట్టుకుంటుంది. తనకు ప్రేమ కన్నా ఫుట్‌బాలే ముఖ్యమన్నందుకు ఓ ఉన్మాది చేతిలో యాసిడ్‌ దాడికి గురైన అమ్మాయి.. కోచ్‌ ఇచ్చిన మనోస్థైర్యంతో తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం, పెళ్లెయి.. సంప్రదాయ కుటంబంలో గృహిణిగా సెటిలైన యువతి తిరిగి జట్టులోకి రావడం వంటి చక్కని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇక, ఫుట్‌బాల్‌ గేమ్‌లోనూ భావోద్వేగాల కంటే.. ప్రేక్షకులను కట్టిపడేసి విన్యాసాలను చూపించడానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అంతగా ఆకట్టుకోకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్రధాన అస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా శివంగివే పాట స్ఫూర్తిదాయకంగా ఉంది. జీకే విష్ణు నీట్‌ సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ డైరెక్టర్‌ ముథురాజు పనితనం సినిమాలో కనిపిస్తోంది. చిత్రస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమాకు బాగా కత్తెరవేసి.. ట్రిమ్‌ చేసి.. కథను క్రిస్ప్‌గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఎప్పటిలాగే విజయ్‌ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అతన్ని ప్రేమించే ఏంజిల్‌ ఆశ్విరాదంగా ఓ మోస్తరు పాత్రకు నయనతార పరిమితమైంది.

10b
హైలైట్స్‌ : విజయ్‌ యాక్టింగ్‌

డ్రాబ్యాక్స్ : సినిమా నిడివి

టైటిల్ : విజిల్‌
నటీనటులు: విజయ్‌, నయనతార, జాకీష్రాఫ్‌, కదీర్‌, యోగిబాబు
దర్శకత్వం : అట్లీ
నిర్మాత :కల్పాతి ఎస్‌ అఘోరం, కల్పాతి ఎస్‌ గణేశ్‌, కల్పాతి ఎస్‌ సురేశ్‌
సంగీతం : ఏఆర్‌ రహమాన్‌

చివరిగా :రెండోభాగంలో విజిల్‌ బాగా వినిపిస్తుంది
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

తమిళ స్టార్‌ హీరో విజయ్‌.. మెర్శల్‌, సర్కార్‌ వంటి భారీ సూపర్‌హిట్స్‌ ఊపుమీదున్నాడు. ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి 'విజిల్‌' అనే స్పోర్ట్స్‌ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్‌-అట్లీ కాంబినేషన్‌లో తేరి, మెర్శల్‌ వంటి బాక్ల్‌బస్టర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటం, ఈ సినిమాలో విజయ్‌ డ్యుయల్‌ రోల్‌ చేస్తుండటంతో.. హ్యాట్రిక్‌...విజిల్‌ మూవీ రివ్యూ