మీలో ఒకర్ని తీసుకెళ్తా….విజయ్‌ దేవరకొండ

యువ హీరో ‘విజయ్‌ దేవరకొండ’ అర్జున్‌ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. తరువాత ‘మహానటి’లో విజయ్‌ ఆంటోనీగా కనిపించి అలరించారు. ఆయన హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’ ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చెన్నైలో షూటింగ్‌ జరుపుకొంటుంది. తాజాగా విజయ్‌ ఫిలింఫేర్‌ ఉత్తమ నటుడు కేటగిరీకి నామినేట్‌ అయ్యారు. ఈసందర్భంగా ఓ వీడియోను అభిమానులకు షేర్‌ చేశారు.

‘వాట్సాప్‌ రౌడీస్‌.. నేను చెన్నైలో ఉన్నా. ‘నోటా’ చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి జాబితాలో నామినేట్‌ అయ్యానట. చిరు సర్‌, వెంకీ సర్.. బాలయ్య బాబు వీళ్లంతా గొప్ప నటులు. చాలా కష్టపడి పనిచేస్తారు. చిన్నప్పడు ఫస్ట్‌ క్లాస్‌ నుంచి వారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక వారి తర్వాత తారక్‌ భాయ్‌, ప్రభాస్‌ అన్న వాళ్ల జనరేషన్‌ ఉంది. వాళ్ల తర్వాతే నేను. ఒక రకంగా చూస్తే నేను బచ్చాగాడిని. వాళ్లతో కలిసి ఉత్తమ నటుడి కేటగిరీలో ఫిలింఫేర్‌కు నామినేట్‌ కావడం గొప్ప అచీవ్‌మెంట్‌. నాకైతే అవార్డు గెలిచినట్లే ఉంది. సాధారణంగా పెళ్లిళ్లలో పెద్దలందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ పిల్లలను ఆడుకోమంటారు. ఒక చిన్న పిల్లాడినైన నన్ను పెద్దలందరూ పిలిచినట్లు ఉంది. నాకు అంతు పట్టలేనంత సంతోషంగా ఉంది. ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్తున్నా.. కాబట్టి నాతో పాటు మీలో ఒకర్ని తీసుకువెళ్తా. మీ గురించి నాకు చాలా ప్లాన్స్‌ ఉన్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో అవన్నీ రివీల్‌ చేస్తా. నన్ను ఎవరైతే బాగా ఇష్టపడతారో.. వారు http://www.rowdyclub.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడ మీ పేరు, వివరాలను ఇవ్వండి. మీలో ఒకర్ని నేను ఫిలింఫేర్‌కు తీసుకెళ్తా’ అని వీడియోను విజయ్‌ దేవర కొండ పంచుకున్నారు.