మొన్న దీపికా ఈరోజు కంగనా!

దీపిక పదుకొన్ నటించిన ‘పద్మావత్’ సినిమాను ఎన్ని వివాదాలు చుట్టుముట్టాయో తెలిసిన సంగతే. సినిమా విడుదలయ్యి కోట్లు కొల్లగొడుతున్నా ఇంకా వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కంగనా ‘మణికర్ణిక’కు కూడా అటువంటి సమస్యే వచ్చింది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ ‘మణికర్ణిక’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమాను హిందీతో పాటు దక్షినాది భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను రాజస్థాన్ సర్వ బ్రాహ్మన్ మహాసభ వ్యతిరేకించడం మొదలుపెట్టింది.

ఈ సినిమాలో లక్ష్మీభాయ్ కు, బ్రిటీష్ వ్యక్తికి మధ్య ప్రేమ బంధాన్ని చూపిస్తున్నారని చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విదేశీయులు రాసిన ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం యుక్తవయసులోనే బ్రిటీష్ వారితో పోరాడిన వీరవనితను తప్పుగా చూపించడం సహించమని ఈ విషయంపై చిత్రబృందాన్ని నిలదీసినా ఎలాంటి స్పందన లేదని సర్వ బ్రాహ్మన్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా తెలిపారు.