విడాకుల వ్యవహారంపై మరోసారి స్పందించిన రేణూ

పవన్‌ కల్యాణ్‌తో విడాకుల వ్యవహారంపై రేణూ దేశాయ్‌ మరోసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో రేణూదేశాయ్‌ మాట్లాడుతూ ‘పవనే తనను విడాకులు కావాలని కోరారు’ అని వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూతో హర్ట్‌ అయిన పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు ఆమెను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పవన్‌-అన్నాలెజ్‌నెవా కూతురు పొలెనా ప్రస్తావన తెస్తూ రేణూ దేశాయ్‌ పీఆర్‌ టీమ్‌ ఆవిడ ఫేస్‌బుక్‌ పేజీలో వరుస పోస్టులు చేసింది.

బేబీ పొలెనా పుట్టింది 13 మార్చి 2012. (9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011). విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తర్వాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ, విడాకుల వ్యవహారం మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.

“అన్నాలెజ్‌నెవా గర్భం దాల్చిన విషయం రేణూ మేడమ్‌కు తెలియదు. పాప పుట్టిన విషయం తెలిసిన తర్వాత పవన్‌కు రేణూ మేడమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఆవిడ మరో ఇంటర్వ్యూలో చెప్పారు” అని పీఆర్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ట్రోల్‌ టెంప్లేట్లను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించటం గమనార్హం.