HomeTelugu Big Storiesఅటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత

మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్ధుడు, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో జీవనాధార వ్యవస్థపై ఉంచారు.

9 14

అటల్ బిహారీ వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డిసెంబర్ 25, 1924న మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయీ. ఆయన తండ్రి కృష్ణబిహారీ గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వాజ్‌పేయీ గ్వాలియర్‌లోని సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదివారు. కాన్పూరులోని ఆంగ్లో వైదిక కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.

1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత మొత్తం వాజ్‌పేయీ పైనే పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా వాజ్‌పేయీ బాధ్యతలు చేపట్టారు. 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయీ దేశానికి సేవలందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu