Homeతెలుగు Newsకోనసీమ రాజకీయాలు

కోనసీమ రాజకీయాలు

కోనసీమ రాజకీయం మరింత వైవిధ్యం. తూర్పుగోదావరి జిల్లాలో పసుపు జెండా ఎగరేస్తామని టీడీపీ నమ్మకంగా ఉంటే.. జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. జనసేన కూడా తెరపైకి రావడంతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయం మరింత ఉత్కంఠ రేపుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలకు ఫిక్సిడ్ ఓటు బ్యాంకు ఉంది. లెక్కలు పక్కాగా ఉంటే పార్టీ జెండా ఎగురుతుందని నేతల నమ్మకం. జనసేన పోటీ తమకు కలిసొస్తుందని వైసీపీ నమ్ముతోంది.

9 ramachandrapuram

రామచంద్రాపురం టీడీపీ కంచుకోట. సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఇక్కడ తక్కువ సంఖ్యలోనే ఉన్నా కమ్మ సామాజిక వర్గం ఓట్లూ కీలకమే. టీడీపీకి మొగ్గు ఉన్న నియోజకవర్గాల్లో రామచంద్రాపురం ఒకటి. జడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణను వైసీపీ బరిలోకి దించుతోంది. మాజీమంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత నియోజకవర్గం. వైసీపీ సింగిల్ కోఆర్డినేటర్‌గా వేణుగోపాలకృష్ణ పదవిలో ఉన్నా స్థానికేతరుడు కావడంతో ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు వైసీపీలో అంతర్గత విభేదాలతో పిల్లి సుభాష్ వర్గం ఎంతవరకు సహకరిస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన పిల్లి సుభాష్ కు ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా మరొకరిని నిలపబోతున్నారు. రామచంద్రపురంలో జనసేన కూడా గట్టి ప్రభావం చూపబోతుందని భావిస్తున్నారు.

9 kottapeta

కోనసీమలోని కొత్తపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ, ఎస్టీల అండదండలు జగ్గిరెడ్డికి గతంలో కలిసొచ్చింది. ఇసుక తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొన్న జగ్గిరెడ్డి ప్రతిపక్షంలో ఉండటంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారనే అభిప్రాయమూ ఉంది. నాలుగేళ్లుగా అధికార పార్టీతో జగ్గిరెడ్డి పోరాటం వైసీపీ కేడర్‌ చెక్కుచెదరకుండా దోహదపడింది. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రూపంలో కొత్తపేటలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది. వచ్చే ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. వైసీపీ సిట్టింగ్ సీటు అయినా వాతావరణం తమకే అనుకూలంగా ఉందంటోంది టీడీపీ. జనసేన ప్రభావం కూడా కొత్తపేటలో ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 2009 లో ప్రజారాజ్యం గెలిచిన కొత్తపేటలో సమర్ధుడైన నాయకుడు బరిలో దిగితే జనసేన ఇక్కడ గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలున్నాయి.

9 pgannavaram

తూర్పుగోదావరి జిల్లాలోని పి. గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉంది. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైనా ఇక్కడ అన్ని పార్టీలూ పత్యేక దృష్టి పెడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి సీనియర్ నాయకుడిగా వ్యక్తిగతంగా మంచి పేరున్నా ప్రజలకు చేరువ కాలేకపోయారనే అభిప్రాయమూ ఉంది. ఇక్కడ అభ్యర్థిని మార్చబోతున్నట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పి. గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబుకు గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి ఉంది. కోనసీమ బీసీ నాయకుడు కుడిపూడి చిట్టబ్బాయి మద్దతు ఉంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవి టికెట్ ఆశిస్తోంది. రాజేశ్వరీ దేవికి గాని, ఆమె కుటుంబానికి గాని చిట్టబ్బాయి అంగీకరించలేదని సమాచారం. రెండు వర్గాలు సర్దుకుపోతే వైసీపీకి అనుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయం ఉంది. పి.గన్నవరంలోనూ జనసేన ప్రభావం ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu