HomeTelugu Big Storiesతెలుగువారి ఆత్మబంధువు వాజ్‌పేయి

తెలుగువారి ఆత్మబంధువు వాజ్‌పేయి

అటల్ బిహారీ వాజ్‌పేయి భరతజాతి ముద్దుబిడ్డే కాదు… తెలుగువారి ఆత్మబంధువు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరిపిన వ్యక్తిగా వాజ్‌పేయికి గుర్తింపు ఉంది. అలాగే తెలుగువారికి కష్టమొచ్చినపుడు నేనున్నానంటూ ముందుకు వచ్చిన ఆత్మీయతా ఉంది. 1977లో వచ్చిన ఉప్పెనతో కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. లక్షలాది మంది నిరాశ్రయిలయ్యారు. ఆ సమయంలో నాగాయలంక మండలం మూలపాలెం గ్రామం ఉప్పెనకు కొట్టుకుపోయింది. అప్పట్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. పునర్నిర్మించిన గ్రామానికి దీన్ దయాళ్‌ పురం అని పేరు పెట్టారు. దీన్ దయాళ్‌ నగర్ గ్రామంలో ఇళ్ల ప్రారంభానికి అప్పట్లో విదేశాంగ మంత్రిగా ఉన్న వాజ్ పేయీ ముఖ్య అతిథిగా వచ్చారు. ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప్పెన కారణంగా కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులకు ఆపన్న హస్తం అందించటంలో ఆర్.ఎస్.ఎస్ చొరవ చూపింది. అందులో వాజ్ పేయీ కీలకంగా వ్యవహరించారు. రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో వాజ్ పేయీ పర్యటించారు. అప్పటి విషయాల్ని వాజ్ పేయీ మరణంతో దీన్ దయాళ్‌ పురం ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

3 18

ఇక విజయవాడతోనూ వాజ్ పేయీకి సంబంధాలు ఉన్నాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత విజయవాడలో జరిగిన జాతీయ పార్టీల సమన్వయ సమావేశానికి వాజ్ పేయీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావటంలో ఆ సమావేశం ఎంతో కీలకమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది. అప్పట్లో విజయవాడలోని బాబాయ్ హోటల్ నుంచి ప్రత్యేకంగా ఇడ్లీలు తెప్పించి ఎన్టీఆర్ వడ్డించినట్లు పాతతరం తెదేపా నేతలు గుర్తు చేసుకున్నారు. అలాగే 1984లో ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కరరావు పదవీచ్యుతుడ్ని చేసినపుడు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో వాజ్ పేయీ పాల్గొన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్, అప్పటి వామపక్ష ముఖ్య నేతలు చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య వంటి వారితో కలిసి సభలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం కోసం జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావటంలో వాజ్ పేయీ కీలకపాత్ర పోషించారు. ఇవన్నీ ఆ మహా నాయకుడు తెలుగునేలపై విడిచి వెళ్లిన తీపి గురుతులే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu