నిఖిల్ కూల్ గానే రివెంజ్ తీర్చుకుంటాడట!

‘స్వామి రారా’,’సూర్య వర్సెస్ సూర్య’,’కార్తికేయ’ వంటి విభిన్న చిత్రాలతో వరుస హిట్స్ ను అందుకున్న హీరి నిఖిల్ రీసెంట్ గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రతి సినిమాలో కొత్త పాయింట్ ఉండేలా చూసుకోవడం నిఖిల్ స్పెషాలిటీ. ప్రస్తుతం నిఖిల్ ‘కేశవ’ సినిమాలో నటిస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా కనిపించనుంది. గతంలో సుదీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్ లో ‘స్వామి రారా’ సినిమా తెరకెక్కింది.

మళ్ళీ కాంబినేషన్ రిపీట్ కానుండడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోకి గుండె కుడి భాగంలో ఉంటుందట. ఇలా ఉన్నవారు టెన్షన్ పడడం, ఎమోషన్ కు గురికావడం, పరుగులు తీయడం వంటి పనులు చేయకూడదు. దీంతో హీరో చాలా కూల్ గా ఉంటూనే.. తన పగను తీర్చుకుంటాడట. సరికొత్త పాయింట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.