Homeతెలుగు Newsపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రాజకీయం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రాజకీయం

వచ్చే ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కూడా పశ్చిమ గోదావరి జిల్లాపై ఫోకస్ పెంచింది. గోదావరి జిల్లాల్లో మెజారిటీ సంపాదిస్తే అధికారం సొంతమవుతుందనే సెంటిమెంట్‌ను అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఒక్క సీటూ రాని వైసీపీ ఈసారి ఎలాగైనా పైచేయి సాధించాలని పావులు కదుపుతోంది. అందుకే పాదయాత్రలో పశ్చిమగోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. 15 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలున్న పశ్చిమ గోదావరి జిల్లా మొదటి నుంచీ టీడీపీకి కంచుకోటగా నిలుస్తూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లో పశ్చిమలో టీడీపీ ఆధిక్యం సంపాదించడంతో పాటు రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నప్పుడూ జిల్లాలో పట్టు చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. 1983, 1985, 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరిలో అన్ని సీట్లూ గెలుచుకున్న టీడీపీ 1994, 1999 ఎన్నికల్లో 16 అసెంబ్లీ స్థానాల్లో 15 తన ఖాతాలోవేసుకుంది. 2004 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ ప్రభంజనం సమయంలోనూ టీడీపీ గెలిచిన 45 సీట్లలో 5 పశ్చిమగోదావరి జిల్లా నుంచే సాధించింది. 2009లో ప్రజారాజ్యం పోటీలో ఉన్నా జిల్లాలో 5 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి ఒకే స్థానం దక్కింది.

6 1 1

నియోజక వర్గాలవారీగా చూస్తే ఇప్పటివరకూ పశ్చిమగోదావరి జిల్లాలో జోరుమీదున్న టీడీపీ పరుగు వచ్చే ఎన్నికల్లో అదే స్థాయిలో ఉంటుందని చెప్పలేని పరిస్థితి. అన్ని సీట్లూ సాధించి పెట్టిన జిల్లాకు సీఎం అనేక హామీలిచ్చినా ఆ స్థాయిలో అభివృద్ధి లేదనే అసంతృప్తి పశ్చిమగోదావరి జిల్లా ప్రజల్లో ఉంది. దీనికి తోడు ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసే అధికార పార్టీలోనే కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమైంది. కొందరు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను, దోపిడీని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు పార్టీ పటిష్టతనను దెబ్బ తీస్తున్నాయి. ఒకప్పుడు ప్రజారాజ్యమే పెద్దగా ప్రభావం చూపని జిల్లాలో జనసేనతో వచ్చే నష్టం లేదని అధికార పార్టీ ధీమాగా ఉంది. అటు వైసీపీ అధినేత జగన్ పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేకగా దృష్టి పెట్టడం, తిరుగులేదనుకుంటున్న జిల్లాలో పర్యటనలతో పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్తుండటంతో అధికార పార్టీ అప్రమత్తమైంది.

ఏలూరులోని లక్షా 94 వేల మంది ఓటర్లలో కాపు ఓటర్లు సుమారు 55 వేల మంది ఉన్నారు. బీసీలు, వైశ్యులు, ఎస్సీ, ఎస్టీల ప్రభావం కూడా ఎక్కువే. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బడేటి బుజ్జి) 24 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాపు నేత కావడం, కుటుంబ రాజకీయ నేపథ్యం బుజ్జికి కలిసొచ్చింది. ఏలూరు నియోజకవర్గంపై పూర్తి పట్టున్న నేత కావడం అన్ని కులాలను కలుపుకుని వెళ్లడం బడేటి బుజ్జికి ప్లస్ అయింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇళ్ల స్థలాలు, స్మార్ట్ సిటీగా ఏలూరు, రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని ఇచ్చిన హామీల్లో రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంతో ఏలూరు పట్టణ రూపురేఖలు మారిపోయాయి. స్మార్ట్ సిటీగా మార్చే పనుల వేగం కూడా పుంజుకున్నాయి. ఇళ్ల నిర్మాణం జాప్యంలో ఎమ్మెల్యేకు మైనస్ అవుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల విస్తరణలో కొన్ని సెంటర్లలో సమస్యలు అలాగే ఉండటంతో ఏలూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏలూరు అభివృద్ధి గతంకంటే మెరుగ్గా ఉండటంతో పట్టణఁలోని 50 డివిజన్లు చుట్టూ ఉన్న 7 పంచాయతీల్లో అనుచరగణంతో పాటు టీడీపీ బలంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ఎమ్మెల్యే బుజ్జి ధీమాగా ఉన్నారు.

6 15

వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పాటు జనసేన బరిలోకి దిగుతుండటంతో కాపుల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. మరోపక్క మేజర్ పంచాయతీ వెంకటాపురంలో కీలక నాయకులు టీడీపీని వీడటం కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఏలూరులో టీడీపీకి అనుకూల వాతావరణమే ఉంటుందని అంటున్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకతతో పాటు జగన్ పాదయాత్ర తర్వాత ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ బాగానే పుంజుకుంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆళ్లనాని వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఏలూరులో వైసీపీ బలంగా ఉన్నా జనసేన ప్రభావంతో ఓట్లు చీలితే ఆ ప్రభావం ఎవరిపై ఉంటుందో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఏలూరులో బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ నేత ఎవరూ తెరపైకి రాకపోవడం జనసేనకు లోటుగా ఉంది. జనసేన నుంచి టిక్కెట్ ఆశించే చోటా నాయకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఏలూరులో జనసేన బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే టీడీపీ, వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. గతంలో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ ఇప్పుడు సొంతంగా ఎన్నికల్లో నిలబడటంతో కాపులతో పాటు పవన్ అభిమానులు అండగా నిలుస్తారని భావిస్తున్నారు. జనసేన తరపున పోటీ చేసేందుకు కాపు అభ్యర్థి అయినా కాకున్నా ఫలితం అనుకూలంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu