HomeTelugu Big Storiesవచ్చే ఎన్నికల్లో పొత్తులుండవంటున్న కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవంటున్న కాంగ్రెస్

2019 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దం అవుతోంది. కొత్త ఇంచార్జ్ ఊమెన్ చాందీ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. హోదా నినాదంతో ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ చెపుతోంది. ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ప్రతి పార్టీ తమకు ప్రతిపక్షమే అంటున్న కాంగ్రెస్ నేతలు….కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి న్యాయం అంటున్నారు.

12

రాష్ట్రంలో చెల్లా చెదురైన కాంగ్రెస్ నేతలు, కార్యర్తలను మళ్లీ ఒక చోటికి తెచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రణాళిక సిద్దంచేశారు. రాష్ట్రంలో రానున్న మూడు నెలల్లో బూత్ స్థాయిలో కమిటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రరత్న భవన్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ అంతర్గత నిర్మాణమే ప్రధాన అంశంగా చర్చ జరిగింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీలో చేరిన తరువాత తొలిసారి విజయవాడ మీటింగ్ కు వచ్చిన మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి పార్టీ కార్యాలయం వరకు కిరణ్ రెడ్డి, ఉమెన్ చాందీలను యువజన కాంగ్రెస్ నేతృత్వంలో ర్యాలీగా తీసుకు వెళ్లారు. దీంతో చాలా కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సందడిగా కనిపించింది.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధ్యక్షులను, వివిధ విభాగాల అధ్యక్షులను మార్చాలని కొందరు నేతలు సూచించారు. మాజీ మంత్రి శైలజానాథ్ జిల్లాల అధ్యక్షులను మార్చాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత యాక్టివ్ గా పని చేసే వారికి అవకాశం ఇవ్వాలని సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు. 2019 ఎన్నికల్లో వైసిపి ప్రధాన ప్రత్యర్థి అని మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం వ్యాఖ్యానించగా….వైసిపి ఒక్కటే కాదు…ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ ప్రత్యర్థే అని మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. ఎన్నికల్లో ఎవరితో పొత్తులు, అవగాహనలు ఉండవని ఈ సందర్భంగా ఊమెన్ చాందీ మరోసారి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలతోనే పొత్తు ఉంటుందని చెప్పిన ఆయన…ఏ రాజకీయ పార్టీలతోనూ పొత్తులుండే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇకపోతే కాపు రిజర్వేషన్ల అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే ప్రకటించినట్లు కాపుల రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలమని, ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని కొందరు నేతలు అభిప్రాయ పడ్డారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో జగన్ తీవ్ర గందరగోళంలో ఉన్నారని అభిప్రాయ పడ్డ నేతలు…..కాపులకు న్యాయం చేసే దిశగా అడుగులు వెయ్యాలని అభిప్రాయ పడ్డారు. పత్యేక హోదా వల్ల జరిగే లబ్దిని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సమావేశంలో కిరణ్ కుమార్‌ రెడ్డి సూచించారు. ప్రాంతీయ పార్టీల వల్ల ప్రయోజనం లేదని, జాతీయ పార్టీలే మేలనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కూడా కిరణ్ నేతలతో వ్యాఖ్యానించారు. ప్రత్యేక హొదా ఇస్తామనే డిమాండ్ తోనే 2019 ఎన్నికలకు వెళతామని ఊమెన్ చాందీ తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మోసం చేశాయని…కాంగ్రెస్ తోనే హోదా వస్తుందని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు
అడుగుతామని ఉమెన్ చాందీ తెలిపారు.

ఇక కర్నూలు జిల్లాలో ఆగస్టులో జరిగే రాహుల్ గాంథీ పర్యటనపై సమావేశంలో చర్చ జరిగింది. సభను భారీగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని…అంతా రావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారు. పార్టీ ఫండ్ విషయంలోనూ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. పార్టీ కార్యక్రమ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులపైనా చర్చ జరిగింది. నేతలు ఆదిశగా ఆలోచన చెయ్యాలని ఊమెన్ చాందీ సూచించారు. పూలదండలు, బొకేలు మాని….పార్టీ ఫండ్ ఇవ్వాలని నేతలకు, కార్యకర్తలకు ఊమెన్ చాందీ సూచనలు చేశారు. మరోవైపు వివిధ వర్గాలనుంచి కూడా ఫండ్ తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!