సీపీఎస్ విధానం రద్దు చేయాలంటూ విజయవాడలోని జింఖానా మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబుకు విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో జరిగిన బహిరంగ సభలో అశోక్‌బాబుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు గళమెత్తారు. ఉపాధ్యాయుల ద్రోహి అశోక్‌బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన మాట్లాడితే సభ నుంచి వెళ్లిపోతామంటూ కుర్చీలు పైకెత్తి ఆందోళన వ్యక్తం చేశారు. అశోక్‌బాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని యూటీఎఫ్ నేత బాబురెడ్డి కోరారు. అయితే ఉపాధ్యాయులు పట్టించుకోకుండా మరొకరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

ముందుగా రైల్వే స్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీనిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది ఉద్యోగులు సీపీఎస్ విధానంతో నష్టపోతున్నారని నినదించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగులు పెద్దగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. శనివారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ‘ఛలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు సభకు తరలివచ్చారు. రైల్వే ఆడిటోరియం నుంచి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.













