మాస్ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 29) ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథ: ఈ సినిమా కథంతా 1993-94 ప్రాంతంలో జరుగుతుంది. రామారావు(రవితేజ) ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. కోర్టు తీర్పుతో చిత్తూరు జిల్లాలోని తన సొంత ప్రాంతానికి ఎమ్మార్వోగా నియమించబడతాడు. అక్కడి ప్రజలను సమస్యలను తనదైన రీతిలో తీర్చుతుంటాడు. తను ప్రేమించిన యువతి మాలిని(రజిషా విజయన్) భర్త సురేంద్ర అనుమానస్పదంగా మిస్ అయినట్లు తెలుసుకొని విచారణ మొదలు పెడతాడు.
రామారావు ఇన్వెస్టిగేషన్‌లో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సురేంద్ర మాదిరే ఆ ప్రాంతానికి చెందిన మరో 20 మంది మిస్ అయినట్లు తెలుస్తుంది. దీని వెనక గంధపు చెక్కల స్మగ్లింగ్ ఉన్నట్లు గుర్తిస్తాడు. అసలు గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు ఈ 20 మందికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ వెనుక ఎవరు ఉన్నారు? ఒక ఎమ్మార్వోగా తనకు ఉన్న అధికారంతో రామారావు ఈ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో రామారావుకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: దర్శకుడు..1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. అడవిలో కప్పిపుచ్చిన ఓ శవం భారీ వర్షానికి బయటకు కనిపిస్తుంటే.. ఓ ముసలాయన ఆ శవం చేతులు నరికేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రామారావు ఎంట్రీ.. ఆయన గొప్పతనం, నిజాయితీ, వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దత తదితర అంశాలను చూపిస్తూ.. హీరో ఎలివేషన్లకి ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. ఇక్కడ సినిమా కాస్త నెమ్మెదిగా సాగినట్లు అనిపిస్తుంది.
రామారావు మాజీ ప్రియురాలు మాలిని భర్త సురేంద్ర కేసు విచారణ చేపట్టినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఈ మిస్సింగ్ కేసుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధం ఉందని తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌ని కాస్త ఎమోషనల్ థ్రిల్లర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రామారావు తండ్రి(నాజర్) హత్య, దాని వెనక ఓ గ్యాంగ్ ఉండడం తదితర అంశాలను ఆసక్తికరంగా చూపించాడు. అయితే కొన్ని రీపీటెడ్ సీన్స్ వల్ల సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాకి పార్ట్-2 కూడా ఉండబోతుంది.
నటీనటులు : ఈ సినిమా వన్ మ్యాన్ షో నడిచింది. ఎమ్మార్వో రామారావు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. పోలీసులకు మాత్రమే కాదు ఎమ్మార్వోకు కూడా ఇన్ని అధికారాలు ఉంటాయా? అనేలా ఆయన పాత్ర ఉంటుంది. పాటలు, యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణుతొట్టంపూడి ఎస్సైగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన పాత్రకి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం కాస్త మైనస్. రామారావు భార్య నందిని పాత్రలో దివ్యాంశ కౌశిక్ ఒదిగిపోయింది.
రామారావు మాజీ ప్రియురాలు మాలినిగా రజిషా విజయన్ ఉన్నంతలో బాగానే నటించింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. నాజర్, నరేశ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
టైటిల్ : రామారావు ఆన్ డ్యూటీ
నటీనటులు : రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి తదితరులు
దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
సంగీతం : సామ్ సీఎస్
హైలైట్స్: రవితేజ
డ్రాబ్యాక్స్: కొన్ని సాగదీత సన్నివేశాలు
చివరిగా: రామారావు డ్యూటీ బాగానే చేశాడు.. కానీ!
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)