లైవ్‌ ఆక్టోపస్‌ను తినబోతే..ప్రాణం మీదకు వచ్చింది

చైనాకు చెందిన ఓ యువతి ప్రాణంతో ఉన్న ఆక్టోపస్‌తో కడుపు నింపుకోవాలనుకుంది. దానికి తగ్గట్టుగానే ఆ సముద్ర జీవిని లైవ్‌ స్ట్రీమింగ్‌లో తినడానికి ప్రయత్నించింది. అయితే విన్యాసం కాస్తా బెడిసి కొట్టి, ఆ ఆక్టోపస్‌తోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఏమాత్రం ఆ యువతికి నోటి చిక్కకుండా తన టెంటకిల్స్‌తో ఆమె చర్మాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో భయానికి గురైన ఆ యువతి గట్టిగా కేకలు వేస్తూ, ఏడుపు మొహం పెట్టి దాన్నుంచి విడిపించుకుకోడానికి విశ్వ ప్రయత్నం చేసింది. దాన్నుంచి వదిలించుకునే క్రమంలో కంటి కింది భాగం ఊహించని విధంగా సాగిపోవడాన్ని చూస్తే ఆమెకు పెద్ద గాయమే అయిందనిపిస్తుంది. ఏడూస్తూనే, చాలా సేపు ప్రయత్నించి దాన్నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే దాని ప్రభావం వల్ల ఆమె మొహం మీద చిన్నపాటి గాయమే అయింది. చైనీస్‌ ఫొటో షేరింగ్ యాప్ కువైషౌలో ఆ యువతి ఈ క్లిప్‌ను షేర్‌ చేస్తూ తొందరలో ఉన్నప్పుడు జీవంతో ఉన్న ఆక్టోపస్‌ను తినడానికి ప్రయత్నించొద్దని ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆక్టోపస్‌ తన రక్షణ కోసం, ఆహార సేకరణ కోసం టెంటకిల్స్‌ను వాడుతుంది.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లక్షల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ప్రాణంతో ఉన్న ఆక్టోపస్‌ తినడానికి ప్రయత్నించిన ఆ యువతిపై వారు తీవ్రంగా మండిపడ్డారు.