భారత్ చేరుకున్న రియల్ హీరో అభినందన్‌

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ స్వదేశానికి చేరుకున్నాడు. అటారీ-వాఘా సరిహద్దులో అభినందన్‌ను పాకిస్థాన్ అధికారులు భారత అధికారులకు అప్పగించారు. ఇరుదేశాల అధికారులు పరస్పరం పత్రాలు మార్చుకున్నారు. శుక్రవారం రాత్రి 09.25 నిమిషాలకు అభినందన్‌ భారత గడ్డపై అడుగుపెట్టాడు. ఆయనకు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్, బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టిన వీరుడు అభినందన్. తాను నడిపిన యుద్ధ విమానం చెడిపోవడంతో ప్యారాచూట్‌ సహాయంతో ప్రాణాలు దక్కించుకున్నా పాకిస్థాన్ భూభాగంలో పడిపోవడంతో అక్కడి అధికారులు అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. యావత్ దేశం అభినందన్‌ రాకకోసం ఎదురు చూసింది. ఆయన క్షేమంగా రావాలని ఆకాంక్షించాయి. అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టిన క్షణాన దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై, అభిందన్ జయహో, జై హింద్ నినాదాలు ప్రతిధ్వనించాయి.

రెండు రోజుల తర్వాత భారత గడ్డ మీద అడుగు పెట్టిన అభినందన్ గుడ్ టు బీ బ్యాక్ అంటూ తన స్పందనను తెలియజేశాడు. అభినందన్ తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు 130 కోట్ల మంది భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం అభినందన్‌ను కారులో అమృత్‌సర్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు.

ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ మీడియాతో మాట్లాడుతూ అభినందన్‌ను పాకిస్తాన్ మాకు అప్పగించింది. ఆయన క్షేమంగా తిరిగిరావడం సంతోషంగా ఉంది. అభిందన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షల చేయాల్సి ఉందని వెల్లడించారు. అంతకుముందు వాఘా సరిహద్దులో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అభినందన్‌ను భారత అధికారులకు ఇంకా అప్పగించలేదు పాకిస్తాన్. ఇప్పటికి రెండు సార్లు అప్పగింత సమయాన్ని మార్చింది. అభినందన్‌ని భారత వాయుసేన వర్గాలకు అప్పగించినట్లు మొదట వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని సమాచారం. పేపర్ వర్క్ వల్లే ఆలస్యమవుతోందని రాత్రి 9 గంటలకు విడుదల చేయవచ్చని సమాచారం అందింది. కానీ 9 తర్వాత కూడా అప్పగించలేదు. వాఘాలో నెలకొన్న పరిణిమాలను కేంద్ర రక్షణ వర్గాలు నిశితంగా గమనించాయి. ఎట్టకేలకు పూర్తి పేపర్ వర్క్ పూర్తైన తర్వాత రాత్రి 09.25కి భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు.