పవన్ కల్యాణ్‌పై మా అధ్యక్షుడి కామెంట్స్


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తన మద్దతు పవన్ కల్యాణ్‌కే ఉంటుందని అన్నారు. ఆయన ఎంత సక్సెస్ అవుతారనేది టైమ్ తీసుకుంటుంది.. కానీ పవన్ కల్యాణ్ పీక్‌లో ఉన్న తన కెరీర్‌ను వదిలి ప్రజల్లోకి వెళ్లి ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వ్యక్తి కావాలి అన్నారు. ఈరోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందో, రెండొందల కోట్లో కావాలి.. కానీ రాజకీయం సామాన్యుడికి అందుబాటులోకి రావాలని పవన్ కల్యాణ్ ముందుకు పోతున్నారు. ఆయనకు నైతికంగా మద్దతిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో వెంటనే ఫలితం రాదని.. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూస్తారని అన్నారు.

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఆయనపై వస్తున్న విమర్శలపై నరేష్ స్పందించారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పడిపోయాయని అన్నారు. ప్రజా సమస్యలు వదిలి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తీ తన జీవితంలో ఎదురైన సమస్యలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని.. అలాంటి విషయాలను బహిరంగంగా ప్రస్తావించేవారికి సిగ్గు అనిపించదా అని ప్రశ్నించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యుడైన రఘపతి వెంకయ్య నాయుడు బయోపిక్‌లో నటించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు నరేష్ తెలిపారు.