వైసీపీలో చేరిన సహజ నటి

తెలుగు సినిమాల్లో సహజ నటిగా పేరుతెచ్చుకున్న సీనియర్ నటి, టీడీపీ నాయకురాలు జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం నాడు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి జయసుధను జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లోకి రావడం జరిగింది అన్నారు. నన్ను ఎవరు రాజకీయాల్లోకి పరిచయం చేశారో.. ఆయన కుమారుడి పార్టీలో చేరటం ఆనందంగా ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబ మెంబర్‌గా ఆయన కుటుంబంలో చేరానని తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రత్యేకించి ఎక్కడ నుండి పోటీ చేయాలను అనుకోవడం లేదు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధమన్నారు. జగన్ ఆదేశాలనుసారం పార్టీకి సేవచేస్తానని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ కచ్చితంగా గెలుస్తారని, సీఎం అవుతారని ఆకాంక్షించారు. ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నానని అన్నారు. టీడీపీలో నేను యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం నేను కాదు వాళ్లు. ఎవరూ చేరిపోయి యాక్టివ్ కారు.. ఏదోటి గైడ్ చేయాలి. రాజశేఖర్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన అదే చేశారు. కాని టీడీపీలో అది జరగలేదు. నేను నా కుటుంబానికి తిరిగి రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు జయసుధ. 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన జయసుధ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీలో చేరారు. జయసుధ టీడీపీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. తన సహ నటుడు మురళీమోహన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జయసుధను టీడీపీలో జాయిన్ చేయించారనే ప్రచారం అప్పట్లో నడిచింది. అయితే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీమోహన్ ఈసారి ఎన్నికలకు దూరం కావడంతో జయసుధ కూడా పార్టీని వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఇంకా టీడీపీలో ఉండగానే.. జయసుధ వైసీపీ కండువా కప్పుకోవడం ఆసక్తిగా మారింది.