‘అదిరింది’కి అదిరిపోయే దెబ్బ!

తమిళనాట వివాదాలు సృష్టిస్తూ.. హాట్ టాపిక్ గా మారింది ‘మెర్సల్’ చిత్రం. ఈ సినిమాలో జీఎస్టీ, కార్పొరేట్ హాస్పిటల్ ల గురించి సంబంధించిన సన్నివేశాలను వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రముఖులు, డాక్టర్లు నినాదాలు చేస్తున్నారు. సినిమా నుండి సదరు సన్నివేశాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ అనే పేరుతో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు నిర్మాత శరత్ మరార్.
 
రేపే(అక్టోబర్ 27) సినిమా విడుదల అంటూ ప్రకటించేశారు కూడా. అయితే ఇప్పటివరకు కూడా సినిమాకు సెన్సార్ క్లియరన్స్ రాలేదు. తమిళనాట చెలరేగుతున్న వివాదాలే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు సెన్సార్ కష్టమవుతోంది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తేనే తెలుగులో సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేస్తామని సెన్సార్ సభ్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
 
దానికి దర్శకనిర్మాతలు అంగీకరించకపోవడంతో విడుదల తేదీ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు ఈ సినిమా తెలుగులో విడుదలవుతుందో.. లేదో.. చూడాలి!