కంగన వ్యాఖ్యలపై అలియాభట్‌ స్పందన

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అభిప్రాయాలను తనలోనే ఉంచుకోవాలని అలియాభట్‌ సూచించింది. జాతీయ, రాజకీయ విషయాలపై స్పందించడంలో అలియాభట్‌ బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తోందని ఇటీవల కంగనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై అలియాభట్‌ స్పందించింది. కంగన అభిప్రాయాన్ని ఆమెలోనే ఉంచుకోవాలని సూచిస్తూనే, తను బాగా మాట్లాడుతుందని కితాబిచ్చింది.

‘కంగనలా నిర్మొహమాటంగా మాట్లాడే సామర్థ్యం నాకు లేదు. ఆ విషయంలో ఆమెను నేను గౌరవిస్తా. కంగనా దృష్టిలో అది సరైనదే కావచ్చు. కొన్నిసార్లు మనం అన్ని వ్యక్తపరచలేం. ఈ ప్రపంచంలో చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయని మా నాన్న చెబుతారు. కేవలం ఒక్కరి అభిప్రాయంతో ఏమీ చేయలేం. నాకూ ఒక భావన ఉంటుంది. అది నాలోనే ఉంచుకుంటా. అయితే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే కంగన స్వభావానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే’ అని తెలిపింది.

ఇక తన సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడంపై కూడా అలియా మాట్లాడింది. తనకు నటించడమంటే ప్రాణమని, అయితే అంతకు మించి ఏదైనా చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. తన నిర్మాణ సంస్థలో సినిమాలు నిర్మిస్తానన్న అలియా, దర్శకత్వం వహించే ఆలోచన అస్సలు లేదని తెలిపింది. సామాజిక సమస్యలపై పనిచేయాలని ఉందని, తన జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చిన అలియా.. ఇది ఆరంభ మాత్రమేనని అంది.