అనకాపల్లిని ఓ స్మార్ట్‌సిటీగా మారుస్తా: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్‌ను ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏ పనీ చేయలేదని విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్‌ కాదు కదా.. కనీసం అండర్‌ పాస్‌ కూడా తేలేకపోయారని మండిపడ్డారు. వైసీపీ నేతలు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించి ఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవన్నారు. అందుకే తాను అధికార, ప్రతిపక్షాన్ని ఎదుర్కొని ఇంతవరకు వచ్చానని చెప్పారు. ఆదివారం సాయంత్రం పవన్‌ విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. జనసేన అధికారంలోకి వస్తే అనకాపల్లిని స్మార్ట్‌ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. జనసేన తరఫున బలమైన అభ్యర్థులను నిలబెట్టామని.. నేటి రాజకీయాల్లో మంచితనం, బలం ఉన్నవాళ్లూ రాణించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నప్పటి నుంచి రామ్‌మనోహర్‌ లోహియా ఆలోచనలంటే తనకెంతో ఇష్టమన్నారు. మనది సోషలిస్టిక్‌, డెమోక్రటిక్‌ దేశమని, ఆ స్ఫూర్తితోనే రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ పెట్టారన్నారు. ఆ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. జనసేన అధికారంలోకి వచ్చిన 16 నుంచి 18 నెలల్లో తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తానని భరోసా ఇచ్చారు. ఈ ఫ్యాక్టరీ అనకాపల్లికి ఆయువుపట్టులాంటిందన్నారు. సహకార సంఘాలను నిర్వీర్యం చేసి ప్రైవేటుపరం చేయవద్దన్నారు. విశాఖ డెయిరీని మూసేయాలనే ఆలోచనలో పాలకులు ఉన్నారని, డెయిరీ స్థలాలు కబ్జా కాకుండా కాపాడతామని చెప్పారు.

ఉత్తరాంధ్రలో 16 నదులు ఉన్నా నీటి సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. శారదా నదీతీరంలో పార్కులు ఏర్పాటు చేసి అనకాపల్లిని ఓ స్మార్ట్‌సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. అక్రమ క్వారీలను అరికట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వ రంగాలతో ప్రైవేటు సంస్థలు పోటీ పడాలిగానీ.. సహకార సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటుపరం చేయడం ప్రజాస్వామిక స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ పార్టీ సహకార రంగానికి అండగా నిలబడుతుందని, విశాఖ డెయిరీని లాభసాటిగా నడిపిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చింతల పార్థసారథిని గెలిపిస్తే లోక్‌సభలో ప్రజా సమస్యలపై గళాన్ని విన్పించగల్గుతారని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తారన్నారు. చాలామంది టీడీపీనేతలు జనసేన వస్తే డ్వాక్రా రుణాలు ఇవ్వరని భయపెడుతున్నారని, గత ఎన్నికల్లో జనసేన అండలేకపోతే ఆ ప్రభుత్వం ఏర్పడేదా.. మహిళలకు డ్వాక్రా రుణాలు ఇచ్చేదా? అని నిలదీశారు. తానెప్పుడూ ఆడపడుచులు బాగుండాలని కోరుకునేవాడినని చెప్పారు.