నాకు, నాన్నకు గొడవలా?: అల్లు అర్జున్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు, ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు మధ్య విభేదాలు వచ్చాయని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. వీటిపై బన్నీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. తమ గురించి వస్తున్న వార్తలు విని నవ్వుకున్నామని తెలిపారు. ‘అవునా.. నాకు, నాన్నకు గొడవలా? ఈ వార్తలు చదివి చాలా నవ్వుకున్నాం. నేను ఇప్పటికీ నాన్నతోనే ఉంటాను. ఎప్పుడూ పని, జీవితం గురించే మాట్లాడుకుంటుంటాం. మా గురించి ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు’ అని తెలిపారు.
ఈ సందర్భంగా తనకు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనుందని బన్నీ తెలిపారు. ‘నాకు హిందీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. నాకు నా సినీ ప్రయాణంలో కంటెంటే ముఖ్యం. మరోసారి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సుకుమార్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నాకు సుకుమార్‌ మంచి స్నేహితుడు. ఒకే రకమైన జోనర్‌లో సినిమాలు చేయాలని లేదు. కొత్త పాత్రలతో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. గతంలో నేను చేసిన పాత్రలను మళ్లీ రిపీట్‌ చేయాలని లేదు. ప్రతి సినిమాకు కొత్తగా, విభిన్నంగా ప్రేక్షకులకు కనిపించాలనుకుంటున్నాను’ అని తెలిపారు.
బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.