తప్పకుండా బాలీవుడ్‌లో నటిస్తా.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు


టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన తాజా చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాతో బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సోంతం చేసుకున్నాడు బన్నీ. రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో బాహుబలి-2 రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ అనేక ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. మెగా ఫ్యామిలీ గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన బన్నీ.. ‘ప్రస్తుతం మేము ఏవైతే విలువలు పాటిస్తున్నామో అవన్నీ మాకు చిరంజీవి నుంచి వచ్చినవే. ఆయన ఏ రోజూ అలా పనిచేయండి.. ఇలా ఉండండి అని మాకు చెప్పలేదు. కానీ ఆయన్ను చూసి మేం చాలా విషయాలను నేర్చుకున్నాం. ఆయన ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. అందుకే మా కుటుంబంలోని హీరోలతో పాటు మరెందరికో ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు’ అని వివరించారు.

అనంతరం బన్నీ హిందీ సినిమాల్లో నటిస్తారా? అని అడిగిన ప్రశ్నించగా .. ‘మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్‌ సినిమాలో నటిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమకు బాలీవుడ్‌ పెద్దన్నలాంటిది. దేశంలోని చాలా చిత్ర పరిశ్రమలు బాలీవుడ్‌ నుంచి స్ఫూర్తి పొందాయి. అక్కడ చాలా మంచి సినిమాలు తెరకెక్కుతాయి’ అని బన్నీ బదులిచ్చారు. ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ సినమాలో నటిస్తున్నారు బన్నీ.

CLICK HERE!! For the aha Latest Updates