నాని సినిమాకి కరోనా దెబ్బ..


కరోనా ప్రభావం మూవీ ఇండస్ట్రీపై కూడా పడింది. రద్దీగా ఉండే షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లలో జనం అంతగా కనిపించడం లేదు. కరోనా విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని, థియేటర్లు బంద్ చేయాలని సూచిస్తే తప్పకుండా మూసివేస్తామని శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో నిర్వహించిన నిర్మాతల మండలి సమావేశంలో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నామని ‘వి’ చిత్ర బృందం ప్రకటించింది. తమ ఆధీనంలోలేని పరిస్థితుల కారణంగా మార్చి 25న రావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తాజాగా ప్రకటించింది.

”వి’ ఓ అద్భుతమైన ప్రయాణం. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ఉత్సుకతగా ఉన్నాం. కానీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పబ్లిక్‌ ఆరోగ్యం, భద్రత మా బాధ్యతగా భావించి సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. అప్పటి వరకు ఈ ఎగ్జైట్మెంట్‌ను అలానే ఉంచుకుందాం.. మీ ఎదురుచూపులకు తగిన విధంగా మా సినిమా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి..’ అంటూ చిత్ర బృందం ప్రకటనలో పేర్కొంది. నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరి ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘వి’. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.