అల్లు శిరీష్‌.. జాతి రత్నం!

యువ నటుడు అల్లు శిరీష్‌ ఓ సాలిడ్‌ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. గౌవరం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్‌, శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత చేసిన ఒక్క క్షణం కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో కాస్త గ్యాప్‌ తీసుకొని రీమేక్‌ సినిమాతో రెడీ అవుతున్నాడు.

మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు శిరీష్‌. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే ఈ యంగ్ హీరో మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమాచేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు జాతి రత్నం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. గతంలో మారుతి దర్శకత్వంలో కొత్త జంట సినిమాలో నటించాడు శిరీష్‌..