‘అనగనగ ఓ ప్రేమకథ’ ఫస్ట్‌లుక్‌ను విడుదలచేసిన వరుణ్‌తేజ్‌

మెగా వరసుడు వరుణ్‌తేజ్‌ ‘అనగనగ ఓ ప్రేమకథ’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. విరాజ్‌ జె అశ్విన్ హీరోగా రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్‌ఎన్‌ రాజు థౌజండ్ లైట్స్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రతాప్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను వరుణ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత కేఎల్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ.. ‘మా పతాకంపై ఈ సినిమా ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. ప్రతాప్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నాను. వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆయనకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాం’ అని తెలిపారు.