ఆ పాత్రను చిరకాలం గుర్తుంచుకుంటా: అనసూయ

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ.. సుచరితా రెడ్డి పాత్రను చిరకాలం గుర్తుంచుకుంటానని అంటున్నారు. ఇటీవల విడుదలైన ‘యాత్ర’ సినిమాలో అనసూయ ఒకప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుచరితా రెడ్డి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా దర్శకుడు మహి వి. రాఘవ్‌కు అనసూయ ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.’యాత్ర’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టిని ప్రశంసలతో ముంచెత్తారు.

‘సుచరితా రెడ్డి పాత్రను చిరకాలం గుర్తుపెట్టుకుంటాను. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి ఈ పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు మహి వి. రాఘవ్‌కు, నిర్మాత విజయ్‌ చిల్లాకు ధన్యవాదాలు. మమ్ముట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్సార్ పాత్రలో నటించి మాకు అప్పటి రోజులను మళ్లీ గుర్తుచేశారు. ‘యాత్ర’ సినిమా చూసినప్పుడల్లా ఆయన ఉన్నప్పటి రోజులు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ‘నేను చస్తే నువ్వు భయపడాలి.. నేను బతికుండగా నీకెందుకు భయం’ (సినిమాలో మమ్ముట్టి అనసూయతో చెప్పిన డైలాగ్‌). ఒక లెజెండ్‌ మరో లెజెండ్‌ పాత్రలో నటించిన విధానాన్ని మీరూ చూడండి’ అని పేర్కొంటూ తన పాత్రకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ట్వీట్‌పై దర్శకుడు రాఘవ్‌ స్పందిస్తూ.. ‘మా ఆడబిడ్డకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.