HomeTelugu Newsఏపీలోనూ 31 వరకు లాక్‌డౌన్‌

ఏపీలోనూ 31 వరకు లాక్‌డౌన్‌

10 19
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ బయట తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితేనే దీన్ని కట్టడి చేయగలమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని.. మనం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 31 వరకు రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జగన్‌ మీడియాతో మాట్లాడారు.

అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సీఎం జగన్‌ సూచించారు. ”పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. వ్యాపారులెవరైనా అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. 10 మందికి మించి ప్రజలెవరూ గుమిగూడొద్దు. కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలి. విదేశాల నుంచి వచ్చిన వారంతా 14 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. అలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టాలి. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదిస్తాం. అవి కూడా తక్కువ రోజులే నిర్వస్తాం” అని వివరించారు.

”కరోనా నివారణకు అధికారులు బాగా కృషి చేస్తున్నారు. వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ఆరు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు నయమై డిశ్చార్జి అయ్యారు. గ్రామ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది బాగా కృషి చేస్తున్నారు. 11,670 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. అందులో 10,091 మందిని ఐసోలేషన్‌లో పెట్టాం. 24 మందిని ఆస్పత్రిలో ఉంచాం. 1165 మందిని 28 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేటెడ్‌ వార్డు ఏర్పాటు చేస్తున్నాం” అని సీఎం జగన్‌ వివరించారు.

”ఈ నెల 29నే రేషన్‌ సరుకులు ఇస్తాం. రేషన్‌తోపాటు కిలో  కందిపప్పు ఉచితంగా అందిస్తాం. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న వెయ్యి రూపాయలు అందజేస్తాం. ఇందుకోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని సీఎం తెలిపారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలను బయటకు పంపొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మార్చి 31 తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితికి అనుగుణంగా ముందుకెళతామని జగన్‌ వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu