మనమిద్దరం.. మరో ఐదుగురి కోసం వెతకాలి.. అనుష్క.. జులియా చాటింగ్‌

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలాగే ఉందంటూ కొన్నిరోజులుగా అమెరికన్‌ గాయని జులియా మైకెల్స్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అనుష్కా.. నీకు చెల్లి ఉందా?’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటో కాస్తా అనుష్క, జులియా కంటపడింది. దాంతో జులియా వెంటనే అనుష్కకు ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హాయ్‌ అనుష్క.. మనమిద్దరం కవలలమట..’ అని సరదాగా మెసేజ్‌ పెట్టారు.

ఇందుకు అనుష్క స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్.. అవును. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. నువ్వు కనిపించావ్‌ కాబట్టి మరో ఐదుగురి కోసం వెతుకుతున్నాను’ అంటూ చమత్కరించారు. దాంతో వీరిద్దరి ట్విటర్ చాట్‌ కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇటీవల బాలీవుడ్‌ సూపర్‌స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను పోలి ఉన్న వ్యక్తి పాకిస్థాన్‌లో ప్రత్యక్షమయ్యాడు. నిజంగానే సల్మాన్‌ వచ్చాడనుకుని అతనితో సెల్ఫీ దిగడానికి పలువురు అభిమానులు ప్రయత్నించారట. గతంలో బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, సైఫ్‌ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌లను పోలి ఉన్న వ్యక్తుల ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.