
Ap Elections 2024: ఏపీలో ఎన్నికల హడావిడి శనివారం సాయంత్రంతో ముగియనున్నాయి. సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార కార్యక్రమాలకు తెరదించనున్నారు. ఇక ఈ రోజుతో రాజకీయ నాయకుల ప్రసంగాలు లేక మైకులన్నీ మూగబోనున్నాయి. ఈ చివరి రోజున రాజకీయ నాయకులు వారి వారి చివరి బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది సినీ, టీవీ సెలబ్రిటీలు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా నంద్యాల వైసీపీ అభ్యర్థి తన విజయం కోసం అల్లు అర్జున్‌ని రంగంలోకి దించాడు.
వైసీపీ నేత, ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. శిల్ప రవి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. దీంతో శిల్ప రవి కోసం అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయడానికి నేడు నంద్యాల వెళ్లారు. నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో అభిమనులు భారీ ర్యాలీతో, గజమాల వేసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మొదట శిల్ప రవి ఇంటి వద్దకు వెళ్లగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు.
నేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ కి మద్దతుగా అల్లు అర్జున్, భార్య స్నేహ రెడ్డి నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో నంద్యాల నుంచి అల్లు అర్జున్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ మామ పవన్ కళ్యాణ్ జనసేన పోటీలో ఉన్నా వైసీపీ నేతకు ప్రచారం చేస్తుండటంతో చర్చగా మారింది.
ఇటీవల పవన్ కళ్యాణ్‌కి అల్లు అర్జున్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ పెట్టారు బన్నీ. పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా అని పేర్కొన్నారు. ‘
ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు బన్నీ. మరో వైపు బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. ఒకే ఇంట్లోని హీరోలు ఇలా వేర్వేరు పార్టీలకు సపోర్ట్ చేస్తుండటంతో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.












