Homeతెలుగు Newsఏపీలో సీబీఐకి షాక్

ఏపీలో సీబీఐకి షాక్

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ ప్రమేయం రాష్ట్రంలో అవసరం లేదని భావించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని ఎత్తివేసింది. అందుకు సంబంధించిన “సమ్మతి” ఉత్తర్వును ఉపసంహరించుకుంది. ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారులను వినియోగించుకునేందుకు.. ఇతర రాష్ట్రాల సమ్మతి అవసరం. ఆయా రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ (సమ్మతి) తెలిపితేనే.. రాష్ట్ర వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకోవాలి. అయితే ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర రంగ ఉద్యోగులపై దాడిచేసే అవకాశం సీబీఐకి ఉండదు.

11 6

సీబీఐలో అంతర్గత విభేదాలున్న విషయం తెలిసిందే. ఇద్దరు సీబీఐ అధికారులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. అందువల్లే సీబీఐపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ హోంమంత్రి చినరాజప్ప ప్రకటించారు. ఇకపై సీబీఐ ప్రతికేసులోనూ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఏపీ సంచలన నిర్ణయంతో ఇకపై సీబీఐ పాత్రను ఏసీబీ పోషించే అవకాశం ఉంది. ఇదే అమలయితే ఏసీబీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఐటీ, పోర్టులు, పోస్టాఫీసులు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు తదితర వాటిపై ఏసీబీ దాడులు చేసే వీలుంటుంది. ఈ అధికారాలన్నింటినీ భవిష్యత్తులో ఏసీబీ వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని పరిశీలకులు అంటున్నారు. తమ జోలికి వస్తే ఏం జరుగుతుందో.. చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించిందని చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu