ఏపీ నూతన కేబినెట్‌ విస్తరణకు డేట్‌ ఫిక్స్‌

ఏపీలో నూతన మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం జూన్‌ 7న మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు. మంత్రివర్గం ఆమోదంతోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు జగన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాసనసభ నిర్వహణపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంతో అసెంబ్లీ అధికారులు చర్చించారు. జూన్‌ 11, 12 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరిగే వీలుంది. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే శాసనసభ కార్యాలయానికి సమాచారం అందించారు. జూన్‌ నెలాఖరులో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.

మరోవైపు జూన్‌ 3 నుంచి 6 వరకు సీఎం హోదాలో శాఖల వారీగా అధికారులతో జగన్‌ సమీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన సచివాలయానికి రానున్నారు. జగన్‌ కోసం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది. ఇప్పటికే వైసీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ఆ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.