ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ధర్మపోరాటం చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబును ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం కోసం కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ మహాకుట్రకి కన్వీనర్‌గా ప్రధాని మోడీ, సభ్యులుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధ్యక్షుడు జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్ వ్యవహరిస్తున్నారని‌ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పట్టించడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అందులో భాగంగానే ఈరోజు ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. మహాకుట్రలో సభ్యుడిగా ఉన్న కేసీఆర్‌ నిన్న నల్గొండ సభలో చంద్రబాబుపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు అని ఆయన అన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని పదాలతో చంద్రబాబును విమర్శించడం ఈ కుట్రలో భాగమేనని ఆరోపించారు. అహంకారంతో తెలంగాణను కేసీఆర్‌ ఎంత నాశనం చేశారో ప్రజలకు తెలుసన్నారు. ప్రపంచంలో హైదరాబాద్‌కి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని, ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా గతంలో చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కనుసన్నల్లో కేసీఆర్‌ పనిచేస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.