Homeపొలిటికల్AP Politics: పొత్తుల్లో భాగంగా టికెట్ల పంపిణీకి ముందే నేతలకు బుజ్జగింపులు

AP Politics: పొత్తుల్లో భాగంగా టికెట్ల పంపిణీకి ముందే నేతలకు బుజ్జగింపులు

Babu and Pawan tie upAP Politics: ఏపీలో పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి వెళ్లబోతున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే సీట్ల పంపకాలపైనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇవాళ, రేపు ఢిల్లీలో బీజేపీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ నుంచి బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. ఏపీలో పొత్తులపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు తమ పార్టీ నేతలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ఇతర పార్టీలతో పొత్తులు ఉన్నందున టికెట్ రాకపోయినా ఎవరూ బాధ పడొద్దని నేతలకు ముందుగానే సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తన పార్టీ నేతలకు పలుసూచనలుచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులకు వెళ్తున్నామని అన్నారు. పదవులు ముఖ్యం కాదని, భావి తరాల కోసమే ఆలోచించాలని, పొత్తులపై ఎవరూ విభేదించొద్దని ఇప్పటికే తన నేతలకు పవన్ సూచనలు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహ పడొద్దని సూచించారు. అలాగే పొత్తులకు సహకరించిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.

జగన్‌తో విసిగిపోయిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు వస్తున్నారని చంద్రబాబు అన్నారు. మంచివారిని, పార్టీకి పనికొస్తారనుకునే వారినే తీసుకుంటామని అన్నారు. అలాంటి చేరికలను ప్రోత్సహించి వారితో కలిసి పనిచేయాలని చంద్రబాబు తమ నేతలకు సూచించారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకుని పార్టీ కోసం కష్టపడాలని సూచించారు.

ప్రస్తుతం చంద్రబాబు పలునియోకవర్గాల్లో రా కదలిరా సభలు నిర్వహిస్తున్నారు. ఇవి పూర్తికాగానే ప్రజా చైతన్య యాత్రను ప్రారంభిస్తానని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు, టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఆప్రణాళికతోనే ముందుకెళ్తున్నారు. ఓ వైపు చంద్రబాబు రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన తనయుడు నారా లోకేష్ శంఖారావం పేరుతో పలు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు.

అంతే కాకుండా మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా తన వంతుగా ఎన్నికల కోసం క్యాడర్‌ను సమాయత్తం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సందర్భంగా మనస్తాపంతో మృతిచెందిన కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఆయా కుటుంబాలకు రూ. 3 లక్షలచొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు కుటుంబం మొత్తం రంగంలోకి దిగింది.

మరోవైపు గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్‌తో పాటు చెల్లెలు షర్మిల, తల్లి విజయలక్ష్మి సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో జగన్‌ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైందనే చెప్పాలి. ప్రస్తుతం ఆ పార్టీలోకి వైఎస్ షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకోబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటంతటి సీన్ లేకపోయినా ఎన్నికల్లో కొంత వరకు కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం చూపించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!