ఆంధ్రప్రదేశ్‌ సభాపతిగా తమ్మినేని

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్‌ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సభాపతి ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. సభాపతి పదవికి తమ్మినేని ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తదితరులు తమ్మినేనిని సభాపతి స్థానం వరకూ తోడ్కొని వెళ్లగా.. ఆయన సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు.