మాజీ విశ్వసుందరిని అవమానించిన వివేక్ ఒబెరాయ్

కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతుంటారు. వారి వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు గానీ, పోస్టర్లు గానీ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. అయితే, తాజాగా బాలీవుడ్ హీరోనే తోటి హీరోయిన్‌ను అవమానించేలా ట్వీట్ చేయడం గమనార్హం. బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యరాయ్‌ని అవమానిస్తూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టిన ఓ పోస్ట్‌ను నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గతంలో ఐశ్వర్య. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసింది. ఆ తరువాత అభిషేక్‌ని పెళ్లి చేసుకొని కూతుర్ని కూడా కన్నది. దీన్ని ఎన్నికల ఫలితాలకు లింక్ చేస్తూ ఓ వ్యక్తి పోస్ట్ తయారు చేశారు.

ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాశారు. ఐశ్వర్యని అవమానించే విధంగా ఉన్న ఈ పోస్ట్‌ను పోస్ట్ చేయడమే కాకుండా క్రియేటివ్! నో రాజకీయాలు.. కేవలం జీవితమే అని కామెంట్ పెట్టాడు కూడా. ఇది చూసిన కొందరు వివేక్ తీరుని తప్పుబడుతున్నారు. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. తెలుగు బాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాలా, సోనమ్ కపూర్ ఈ ట్వీట్ చూసి వివేక్‌పై అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకొని కూతుర్ని కని హ్యాపీగా ఉన్న ఐశ్యర్యరాయ్‌ జీవితాన్ని నవ్వుల పాలు చేసేలా పోస్టులు చేయడం సరి కాదు అని, వెంటనే వివేక్ ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వివేక్ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ అతడికి నోటీసులు జారీ చేసింది.