బన్నీతో నటించాలని ఉంది: బాలీవుడ్‌ నటుడు

నటుడు జాకీ ష్రాఫ్‌ కుమారుడైన టైగర్ గురువారం హైదరాబాద్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియా వర్గాలతో సమావేశమయ్యారు. తనకు టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ అంటే ఇష్టమని తెలిపారు. ఆయనతో కలిసి నటించే రోజుకోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి జాకీ ష్రాఫ్‌ తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించారని మంచి స్క్రిప్ట్‌ వస్తే త్వరలో తానూ టాలీవుడ్‌లో నటించాలనుకుంటున్నానని టైగర్ అన్నారు.

మరో విషయం ఏంటంటే.. ఆయన బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘హీరోపంతి’. తెలుగులో బన్నీ నటించిన ‘పరుగు’ కు రీమేక్‌గా వచ్చింది. బాలీవుడ్‌లో యాక్షన్‌ హీరోలుగా పేరు తెచ్చుకున్నవారిలో టైగర్‌ ష్రాఫ్‌ ఒకరు. ప్రస్తుతం ఆయన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. 2012లో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది.