ఆ స్టార్‌ హీరోని బాలీవుడ్‌కు ఆహ్వానించిన బోనీ కపూర్‌

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ను బాలీవుడ్‌కు రమ్మని నిర్మాత బోనీ కపూర్‌ కోరారు. బోనీ తొలిసారి తమిళంలో నిర్మిస్తున్న సినిమా నేర్కొండ పారవై’. ‘పింక్’ కు తమిళ రీమేక్‌ ఇది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రలో అజిత్‌ నటిస్తున్నారు. విద్యా బాలన్‌ అతిథి పాత్ర పోషిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా తరియాంగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హెచ్‌. వినోద్‌ దర్శకుడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం అవుట్‌ఫుట్‌ చూసిన బోనీ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ‘నేర్కొండ పారవై’ లోని కొన్ని సన్నివేశాల్ని చూశాను. అజిత్‌ నటన విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. త్వరలోనే హిందీ సినిమా చేయడానికి ఆయన ఒప్పుకొంటారని ఆశిస్తున్నా. నా వద్ద మూడు స్క్రిప్టులు ఉన్నాయి.. కనీసం ఒక్కదానికైనా ఓకే చెప్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. ‘నేర్కొండ పారవై’ పనులు పూర్తయిన తర్వాత అజిత్‌-బోనీ కాంబినేషన్‌లో మరో తమిళ సినిమా రాబోతోంది. అజిత్‌ ఇటీవల ‘విశ్వాసం’ సినిమాతో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.