‘శరణం గచ్ఛామి’ కి సెన్సార్ తిరస్కరణ!

అసభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టిస్తూ.. అత్యంత జుగుప్సాకరమైన కధ, కథనాలు, రోత పుట్టించే సన్నివేశాలతో కూడిన సినిమాలకు ‘క్లీన్ సర్టిఫికెట్స్’ జారీ చేసే సెన్సార్ బోర్డ్.. యువతరాన్ని మేల్కొలుపుతూ.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ.. క్లీన్ ఎంటర్ టైనర్ గా.. ఎంతో నిబద్ధతతో.. నిజాయితీతో రూపొందించిన తమ ‘శరణం గచ్ఛామి’ సినిమాకు మోకాలడ్డుతుండడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోందని అంటున్నారు చిత్ర నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ప్రేమ్ రాజ్.

సహేతుకమైన కారణాలు చూపకుండా.. రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణిని, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

తమ వాదనలో నిజముందని.. తమకు జరుగుతున్నది కచ్చితంగా అన్యాయమేనని భావిస్తే.. మీడియా మిత్రులు తమకు చేయూతనందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వతహా ఎన్. ఆర్.ఐ అయిన బొమ్మకు మురళి.. ఈ చిత్రానికి తనే స్వయంగా కథ-స్క్రీన్ ప్లే అందించారు.