మీరు కేసు పెడతానంటే మేం నాలుగు కేసులు పెడతాం:చంద్రబాబు

కేసీఆర్‌ హుందాతనం కోల్పోయి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం హోదాలో ఉండి అనాగరికంగా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. తనను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. నోరుందని పారేసుకోకూడదని హితవు పలికారు. ఏపీలో మోడీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి పోటీ చేస్తానంటే చేయండి.. అంతేగానీ ముసుగులో గుద్దులాట ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్‌ మిడిల్‌ మోడీ అయితే, జగన్‌ జూనియర్‌ మోడీ అని ఎద్దేవాచేశారు. ప్రజావేదికలో ఎనిమిదో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం మీడియాతో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ సందర్భంగా మోడీ, కేసీఆర్‌, జగన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు చేసింది చెప్పడమే అలవాటు అని, పద్ధతిలేని రాజకీయాలు ఏనాడు చేయలేదని తెలిపారు.

‘కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి తెలసుకోండి. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో తెలుగుదేశంతో పొత్తు కేసీఆర్‌ పెట్టుకోలేదా? తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానని చెప్పారు. మరి ఏం చేశారు. ఎప్పటికి ఏది దొరికితే అది కేసీఆర్‌ మాట్లాడతారు. ఏపీకి వచ్చి మోడీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి పోటీ చేయండి. ముసుగులో గుద్దలాట ఎందుకు? ఇక్కడున్న వారు కేసీఆర్‌కు కావాలి. మళ్లీ ఆంధ్రవాళ్లను తిట్టాలి. ఇదేం రాజకీయం. మోడీ నమ్మించి మోసం చేయడం వల్లే వ్యతిరేకించాం. అవిశ్వాస తీర్మానం, హోదా విషయంలో కాంగ్రెస్‌ సహకరించింది. అందుకే కాంగ్రెస్‌తో కలిశాం.

హైకోర్టు కోర్టు విభజనను నేను స్వాగతించా. అలాగని వెంటనే వెళ్లమంటే ఎలా? నోటిఫికేషన్‌ ఇచ్చింది కేంద్రం కాదా? ఉన్న ఫళంగా వెళ్లమంటే ఎలా వెళ్తాం. నెలరోజులు ఇవ్వాలని అడిగాం. నాలుగు రోజులు ఇస్తే ఎలా సరిపోతుంది. సుప్రీం కోర్టు నాలుగు రోజులు ఇవ్వాలని చెప్పిందా? దాని మీద కేసీఆర్‌ ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కున్నారని కేసీఆర్‌ అంటున్నారు. అప్పుడు కేసీఆర్‌ నాతోనే ఉన్నారుగా. వైస్రాయ్‌ ఘటనలో కేసీఆరే సిద్ధాంతకర్త. హరికృష్ణ చనిపోతే రాజకీయాలు చేశానని అంటున్నారు. నేనేం చేశాను.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుందామని ఎప్పటి నుంచో చెబుతున్నా. హోదా కోసం లేఖ రాస్తానని అంటున్నారు. రాయండి. మంచిదే. అదే హోదా మీద రోజుకో మాట మాట్లాడుతున్నది మీరు కాదా? ప్రజా సౌకర్యం కోసం సచివాలయం కట్టుకుంటుంటే దానికి అంత ఖర్చు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మరి మీరు రూ.300 కోట్లు పెట్టి ఇల్లు ఎందుకు కట్టుకున్నారు.

మోడీని అసభ్య పదాలతో దూషిస్తారు. ఇద్దరూ ఇష్టపడి తిట్టుకుంటారు. మళ్లీ ఇద్దరూ ఒకే రూమ్‌లో కలిసి కుట్రలో పాలుపంచుకుంటున్నారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చానని కేసీఆర్‌ చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో ఈ నాలుగేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమే. ఏపీ 11 శాతం సాధించింది. రైతుల కోసం తాను పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని చెబుతున్నారు. అదే దేశం 2.4 శాతం సాధిస్తే.. ఈయన వల్ల 0.2 శాతం వృద్ధి సాధించింది. ఇరిగేషన్‌ కోసం లక్ష కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్‌ చెబుతున్నారు. మరి ఏవీ కనిపించడం లేదే.

నాకు భాష రాదని అంటున్నారు. ఆయనకు ఏదో భాషొచ్చని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో చదివారు మరి! ఆయన నా చేత జైతెలంగాణ అనిపించానని చెబుతున్నారు. ఆయన అనిపించేది ఏమిటి? విభజిస్తానంటే విభజించండి అని నేనే చెప్పా. మోడీ వస్తుంటే చచ్చామా? బతికామా? అని అడిగితే మోడీ రాకుండా ఆగిపోయారు. అందుకే కేసీఆర్‌ను పెట్టి తిట్టిస్తున్నారు. మీరు కేసు పెడతానంటే మేం నాలుగు కేసులు పెడతాం.

ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో నా కథ అర్థం కాదని కేసీఆర్‌ అంటున్నారు.ఆయనో పెద్ద వ్యూహచతురుడి మరి!. మోడీ కోసం జగన్‌, కేసీఆర్‌ పనిచేస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందడం మోడీ, కేసీఆర్‌కు ఇష్టం లేదు. వీరికి జగన్‌ తోడు. ఇక్కడి గెలవడానికే జగన్‌ వారితో కలుస్తున్నారు. కేసీఆర్‌ మిడిల్‌ మోదీ అయితే, జగన్‌ జూనియర్‌ మోదీ. అందరితో వ్యవహరించినట్టు నాతో అంటే కుదరదు. మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరం. ప్రధాని మోడీతోనే పోరాడుతున్నా. మానసికంగా నన్ను ఎవరూ దెబ్బతీయలేరు’ అని చంద్రబాబు అన్నారు.