Homeపొలిటికల్AP Elections 2024: కిరణ్ కుమార్ రెడ్డిని కొనియాడిన చంద్రబాబు

AP Elections 2024: కిరణ్ కుమార్ రెడ్డిని కొనియాడిన చంద్రబాబు

AP Elections 2024AP Elections 2024: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నేడు కిరణ్ కుమార్ కు మద్దతుగా రాజంపేటలో ఏర్పాటు చేసిన కూటమి ప్రచార సభలో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ… కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అని కొనియాడారు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని పేర్కొన్నారు. తామిద్దరం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇన్నాళ్లకు రాజంపేట ద్వారా తమ కాంబినేషన్ కుదిరిందని చంద్రబాబు చమత్కరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఇక చంద్రబాబు తన ప్రసంగంలో యథావిధిగా సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలని అన్నారు. సీఎం జగన్ కు ఎన్నికలప్పుడు ఏదో ఒక డ్రామా ఆడడం అలవాటని, గత ఎన్నికల సమయంలో బాబాయ్ గొడ్డలిపోటుతో సానుభూతి పొందే ప్రయత్నం చేశాడని, కోడికత్తి డ్రామా కూడా ఆడాడని ఆరోపించారు.

ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపాడని ఎద్దేవా చేశారు. ఆ గులకరాయిని మేమే వేయించామని అంటున్నాడని, ఆ గాయం రోజు రోజుకు పెద్దది అవుతోందని, మానడం లేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ గాయానికి ప్రజలే ట్రీట్ మెంట్ ఇవ్వాలని అన్నారు. రేపు 13వ తేదీన జరిగే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించడమే ఆ ట్రీట్ మెంట్ అని స్పష్టం చేశారు. రాజంపేటకు జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజి ఏర్పాటవుతుందని చంద్రబాబు వెల్లడించారు.

 

ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. సారా వ్యాపారాలు చేసే మిథున్ రెడ్డి నేను పోటీ చేసి పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తాడంట అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓసారి తాను ఢిల్లీలో మిథున్ రెడ్డిని కలిశానని, ఆ సందర్భంగా అతడు ఒకటే చెప్పాడని వెల్లడించారు. “మేం మా జిల్లాకు ఎవరినీ రానివ్వం… మా జిల్లాకు ఎవరొచ్చినా ఎదుర్కొని తొక్కేస్తాం అని ఆ పెద్దమనిషి చాలా అందంగా చెప్పాడు” అని పవన్ వివరించారు.

“ఇక్కడ యువత చాలామంది ఉన్నారు. మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? సలసలమని కాగే రక్తం మీది! గొలుసులు తెంచుకునే కండబలం మీది! మరి గుండెబలం ఎందుకు లేదు మీకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని కొట్టే గుండెబలం ఉందా, లేదా?” అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు.

ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయం అని తెలియడంతో జగన్ 70 మంది అభ్యర్థులను మార్చాడని, ఆ విధంగా అభ్యర్థిని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిదని వెల్లడించారు. ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని పాతాళానికి తొక్కేస్తున్నాం… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

“ఈ జిల్లాలో సంపద అంతా కేవలం ముగ్గురు వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది. పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి చేతుల్లోనే సంపద ఉంది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన దుర్ఘటనే వైసీపీ ఇసుక దోపిడీకి నిదర్శనం. ఇష్టానుసారం ఇసుక దోచేసి డ్యాం గేట్లు తెగిపోతున్నా పట్టించుకోలేదు. తద్వారా 39 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. 9 ఊళ్లు కొట్టుకుపోయాయి. డ్యాం నిండిపోయిందని లస్కర్ రామయ్య చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన హెచ్చరికతో మిగతా ప్రజల ప్రాణాలు నిలబడ్డాయి. లస్కర్ రామయ్యకు జనసేన తరఫున రూ.2 లక్షలు ఇచ్చాం” అని పవన్ కల్యాణ్ వివరించారు. కూటమి తరఫున రాజంపేట లోక్ సభ స్థానం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పవన్ పిలుపునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!