Homeతెలుగు Newsటీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన చేవెళ్ల ఎంపీ

టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన చేవెళ్ల ఎంపీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కు గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి, తన ఎంపీ పదవికి ఆయన అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ మేరకు మూడు పేజీల రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు. ప్రధానంగా ఐదు కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో తనకు సరైన గౌరవం లేదన్నారు. వివిధ సందర్భాల్లో తనకెదురైన అనుభవాలతోనే పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంచేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, తెలంగాణఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి కేబినెట్‌లో చోటు కల్పించారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణ కోసం పోరాడిన వారి అవసరం టీఆర్‌ఎస్‌కు లేదని తనకు అన్పిస్తోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో సంప్రదాయ రాజకీయాలు లేవని తెలిపారు. రాష్ట్ర, పార్టీ స్థాయిల్లో ఎలాంటి గుర్తింపు ఉండటంలేదన్నారు. ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలకు ఆశించిన స్థాయిలో పనిచేశానన్నారు. పార్టీ గత రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అనేక సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అగాథం పెరిగిపోయిందని తనకు అనిపించిందని, ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

11 9

తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విశ్వేశ్వర్‌ రెడ్డి ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి గెలుపొందారు. రాజీనామాకు దారితీసిన కారణాలను ఆయన రేపు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కేటీఆర్‌తో భేటీ అనంతరం రేవంత్‌ వ్యాఖ్యలను కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఖండించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన అనూహ్యంగా ఈ రాజీనామా నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu