Homeతెలుగు Newsచంద్రబాబు 'యువనేస్తం' ప్రారంభం

చంద్రబాబు ‘యువనేస్తం’ ప్రారంభం

అమరావతిలోని ప్రజావేదిక హాలులో ‘యువనేస్తం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 400 మంది లబ్ధిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖాముఖి నిర్వహించారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతలు గాంధీజీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి జన్మించిన రోజున ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

5 1

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోనే యువతరం ఎక్కువగా ఉన్న దేశం మనదేనని తెలిపారు. అర్హులైన యువత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే వారి ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించి పథకాన్ని వర్తింపచేస్తారని తెలిపారు. ఈ పథకానికి 6.15లక్షల మంది నమోదు చేసుకోగా… వెరిఫికేషన్‌ తర్వాత సుమారు 2.15లక్షల మంది అర్హత సాధించినట్లు తెలిపారు. వీరి బ్యాంక్‌ అకౌంట్‌కు ప్రయోగాత్మకంగా నిన్ననే రూపాయి జమ చేశామని.. మిగిలిన రూ.999 రేపు జమ అవుతుందని చెప్పారు. గతంలో ఇలాంటి పథకాలు కొన్నిచోట్ల ప్రారంభించినా విఫలమయ్యాయని.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

నిన్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అర్హత పొంది చివరలో నమోదు బటన్‌ క్లిక్‌ చేయని 20వేల మందికి కూడా నిరుద్యోగ భృతి అందేలా నిబంధనల్లో సడలింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. భృతిని బుధవారంలోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే యువనేస్తం పథకం ప్రారంభోత్సవాల్లో లబ్ధిదారులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు భృతి రూ.వెయ్యితో పాటు అప్రెంటిస్‌షిప్‌ సమయంలో రూ.1500 ప్రోత్సాహకంగా ఇచ్చేందుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భృతికి అర్హులై ఇప్పటికీ దరఖాస్తు చేసుకోనివారు ప్రతి నెలా 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!