కొత్త మంత్రులపై బాబు వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. ముస్లిం, మైనారిటీ వర్గాలకు ఎన్నడూ లేని విధంగా పదవులు ఇచ్చామని తెలిపారు. ఐఏఎస్ కావాల్సిన శ్రావణ్ మంత్రి కావడం వినూత్న పరిణామమని అభిప్రాయపడ్డారు. శ్రావణ్‌లో సర్వేశ్వరరావును చూసుకుంటూ అంతా అండగా నిలవాలని కోరారు. సర్వేశ్వరరావు రెండో కుమారునికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని.. కుమార్తె డాక్టర్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

సివేరి సోమ తనయుడు అబ్రహంను ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తున్నామని తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ వారికి అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. నష్టపోయిన కుటుంబాలకు అన్ని విధాలుగా చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఫరూక్‌పై చంద్రబాబు సరదా వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ చాలా ముదురని.. ఆయనకు ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని సరదాగా చమత్కరించారు. కొత్త మంత్రులకు అంతా సహకరించాలని చంద్రబాబు సూచించారు. కిడారిని అందరూ ఆశీర్వదించి సహకరించాలని కోరారు.