ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలు

2019లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. పార్టీలు మారాలని కొందరు అసంతృప్త నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న కొందరు నేతలు జనసేనవైపు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేని బీజేపీలో ఉండే కంటే బలమైన ప్రభావం చూపగల పార్టీలో చేరాలని కొందరు భావిస్తున్నారు. పలువురు నేతలు జనసేన వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యం దక్కని నేతలు, అధినేత ముఖ్యనేతల తీరుపై అసంతృప్తితో ఉన్నవారు పార్టీ మారేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఓ బీజేపీ ప్రజాప్రతినిధి జనవరి లేదా ఫిబ్రవరిలో జనసేనలో చేరతారని సమాచారం. తనకు పార్లమెంటు టిక్కెట్టు లేదా తన భార్యకు అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని ఇప్పటికే జనసేన అధినేతతో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.

ఇక్కడ నుంచే మరో బీజేపీ సీనియర్‌ నేత కూడా జనసేన తరపున రాజమహేంద్రవరం లోక్‌సభ టిక్కెట్టు కోసం ఇప్పటికే లోపాయికారిగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత, గతంలో లోక్‌సభకు పోటీచేసిన ఓ నాయకుడు కూడా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సదరు నేతకు పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చేందుకు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. కోనసీమ నుంచి బీజేపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి అమలాపురం లేదా గన్నవరం అసెంబ్లీలకు జనసేన టిక్కెట్టు హామీపై త్వరలో పార్టీలో చేరడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.

మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. బలమైన ప్రభావం చూపగల పార్టీలో చేరాలని పలు పార్టీల్లోని అసమ్మతి, అసంతృప్తి నాయకులు దృష్టిసారించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి నెరవేర్చని బీజేపీలో ఉన్న నేతలు పలువురు జనసేన వైపు దృష్టిసారించారు. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీలో ఉన్నా ప్రయోజనం ఉండదని గ్రహించిన పలువురు నేతలు ఇప్పటి నుంచే రాజకీయ భవిష్యత్తు చూసుకునే పనిలోపడ్డారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో ప్రాధాన్యం దక్కని నేతలు, అధినేత, ముఖ్యనేతల తీరుపై విసిగిపోయినవారు.. పార్టీ మారడానికి ఇదే తరుణం అన్న రీతిలో దృష్టిసారిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఓ బీజేపీ ప్రజాప్రతినిధి జనవరి లేదా ఫిబ్రవరిలో జనసేనలో చేరతారని అనుచరులు బాహాటంగా చెప్తున్నారు. తనకు పార్లమెంటు టిక్కెట్టు కానీ, తన భార్యకు అసెంబ్లీ టిక్కెట్టు కానీ ఇవ్వాలని ఇప్పటికే జనసేన అధినేతతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలో రెండు విడతల ప్రచారం నిర్వహించిన పవన్‌కల్యాణ్‌ మూడో విడత ప్రజాపోరాటయాత్ర త్వరలో చేయనున్నారు. వైసీపీలో తగిన ప్రాధాన్యం లేదని భావించిన పలువురు నేతలు ఇప్పటికే జనసేనలో చేరారు. వైసీపీలో కోనసీమలో కీలకనేతగా గుర్తింపుపొందిన శెట్టిబత్తుల రాజబాబు, మండపేట కోఆర్డినేటర్‌ పదవి నిర్వహించిన వేగుళ్ల లీలాకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్‌., మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కుటుంబం.. ఇలా పలువురు కీలక నాయకులు ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. టీడీపీ నుంచీ ఇద్దరు నేతలు జనసేన వైపు దృష్టిసారించారు. పెద్దాపురం టిక్కెట్టు ఆశిస్తున్న ఒక నేత ఇప్పటికే పలు దఫాలు అనుచరులతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. నాలుగు నెలల కిందట వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సామర్లకోట ప్రచారంలో పవన్‌కి నలుగురు పెళ్లాలు.. కార్లు మార్చినట్టు పెళ్లాలను మారుస్తారు.. అంటూ పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన పవన్‌ అభిమానులు, సామాజికవర్గ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారినట్టు విశ్లేషకులు అంచనా. జిల్లాలో కనీసం పది అసెంబ్లీ స్థానాల్లో జనసేన గెలుపోటములను నిర్ణయించే కీలక శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.